12 రోజుల్లోనే
ఇందిరమ్మ ఇల్లు!

- షియర్ వాల్ టెక్నాలజీతో వేగవంతమైన నిర్మాణం
హైదరాబాద్, జూన్ 2 (విశ్వం న్యూస్): పేదల సొంతింటి కలను సాకారం చేసే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకంలో కొత్త సాంకేతికతకు శ్రీకారం చుట్టింది. అత్యాధునిక షియర్ వాల్ టెక్నాలజీ ద్వారా కేవలం 12 రోజుల్లోనే ఇల్లు నిర్మించి లబ్ధిదారులకు అందజేసి కొత్త రికార్డు సృష్టించింది.
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలం కొఠారి గ్రామంలో ఈ విధానంలో నిర్మించిన ఇంటిని సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ప్రారంభించారు. సాధారణంగా 90 రోజులు పట్టే గృహ నిర్మాణం, ఈ సాంకేతికతతో 12 నుంచి 15 రోజుల్లోనే పూర్తవుతోంది.

అల్యూమినియం ఫార్మ్‌వర్క్, ఆర్‌సీసీ, స్టీల్ వినియోగంతో ఇటుకలు లేకుండానే గోడలు, స్లాబ్‌ను ఒకేసారి నిర్మించడం ఈ పద్ధతి ప్రత్యేకత. దీంతో ప్లాస్టరింగ్ అవసరం తగ్గడమే కాకుండా గోడలకు పగుళ్లు వచ్చే అవకాశాలు కూడా తక్కువగా ఉంటాయని అధికారులు చెబుతున్నారు.
రాష్ట్రంలోని నాగర్‌కర్నూల్, నిజామాబాద్, కామారెడ్డి, నారాయణపేట్, మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో ఇప్పటికే ఈ విధానంలో సుమారు 150 ఇళ్లు నిర్మించారు. ఆదివాసీ, గిరిజన ప్రాంతాల్లో రవాణా ఖర్చులు, కార్మిక వ్యయం తగ్గించేందుకు ఈ సాంకేతికత ఉపయోగపడుతుందని గృహనిర్మాణ శాఖ భావిస్తోంది.
ప్రభుత్వం మంజూరు చేసే రూ.5 లక్షలతోనే 401 చదరపు అడుగుల విస్తీర్ణంలో బెడ్‌రూమ్, హాల్, వంటగది, బాత్రూం తదితర సదుపాయాలతో నాణ్యమైన ఇల్లు నిర్మించవచ్చని అధికారులు వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో ఈ విధానాన్ని విస్తృతంగా అమలు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది.