గ్రామ స్వరాజ్యంపై
ప్రభుత్వ దాడి: శ్రవణ్

- ఉప సర్పంచుల హక్కులు కాపాడాలని బీఆర్ఎస్ డిమాండ్
హైదరాబాద్, జూన్ 15 (విశ్వం న్యూస్) : గ్రామ స్వరాజ్యాన్ని బలహీనపరుస్తూ ప్రజాస్వామ్యాన్ని బ్యూరోక్రసీ చేతుల్లో పెడుతున్నారని కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ డాక్టర్ దాసోజు శ్రవణ్ విమర్శలు గుప్పించారు.

తెలంగాణ రాష్ట్ర ఉప సర్పంచుల ఫోరం ప్రతినిధులు తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను కలిసి తమ సమస్యలను వివరించి, ఆరు ప్రధాన డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడిన శ్రవణ్, ఉప సర్పంచుల చెక్ పవర్, సంతకం హక్కులను తొలగించే ప్రయత్నాలు ప్రజాస్వామ్య వ్యతిరేక చర్యలని అన్నారు.
ఉప సర్పంచులు, వార్డు సభ్యులకు గౌరవ వేతనం కల్పించాలని, పంచాయతీరాజ్ చట్టం-2018లోని హక్కులను పూర్తిగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. గ్రామాల్లో సర్పంచులు, ఉప సర్పంచుల మధ్య విభేదాలు సృష్టించే రాజకీయాలు మానుకోవాలని ప్రభుత్వానికి హెచ్చరించారు.
కేసీఆర్ హయాంలో పల్లె ప్రగతి ద్వారా గ్రామాలు అభివృద్ధి చెందగా, ప్రస్తుతం అభివృద్ధి పనులు కుంటుపడ్డాయని శ్రవణ్ ఆరోపించారు. ఉప సర్పంచులు, వార్డు సభ్యుల హక్కులను పరిరక్షించి గ్రామాభివృద్ధికి ప్రభుత్వం సహకరించాలని కోరారు.