జర్నలిస్టుల ఇండ్లస్థలాలపై త్వరగా నిర్ణయం తీసుకోవాలి -డిప్యూటీ సీఎం భట్టికి టీడబ్ల్యూజేఎఫ్ వినతి

హైదరాబాద్, జూన్ 16 (విశ్వం న్యూస్) : జర్నలిస్టులకు ఇండ్ల స్థలాల కేటాయింపుపై ఏర్పాటు చేసిన క్యాబినెట్ సబ్ కమిటీ త్వరితగతిన నివేదిక సమర్పించి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) రాష్ట్ర ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను కోరింది.
మంగళవారం ప్రజాభవన్‌లో డిప్యూటీ సీఎంను కలిసి టీడబ్ల్యూజేఎఫ్ నాయకులు వినతిపత్రం సమర్పించారు. జర్నలిస్టులు ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా పనిచేస్తున్నప్పటికీ తగిన వేతనాలు, ఉద్యోగ భద్రత లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వివరించారు. గత నాలుగు దశాబ్దాలుగా హైదరాబాద్‌లో జర్నలిస్టులకు ఇండ్ల స్థలాల కేటాయింపు జరగలేదని, దీంతో అద్దె భారం పెరిగి కుటుంబాలు ఆర్థికంగా నష్టపోతున్నాయని తెలిపారు.
హైదరాబాద్‌తో పాటు జిల్లా, మండల కేంద్రాల్లో కూడా జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు కేటాయించాలని కోరారు. అలాగే ప్రభుత్వ ఉద్యోగుల తరహాలో హెల్త్ కార్డులు మంజూరు చేసి కార్పొరేట్ ఆసుపత్రుల్లో వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
జర్నలిస్టుల అక్రెడిటేషన్ ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలని, అర్హులందరికీ న్యాయం చేయాలని కోరారు. పెరుగుతున్న విద్యా ఖర్చుల నేపథ్యంలో జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల్లో 50 శాతం ఫీజు రాయితీ కల్పించాలని డిప్యూటీ సీఎంకు విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి. బసవపున్నయ్య, ఉపాధ్యక్షులు ఎల్లోయి ప్రభాకర్, జి. మాణిక్ ప్రభు, కార్యదర్శి బి. జగదీశ్వర్ తదితరులు పాల్గొన్నారు.