ఖైరతాబాద్ నుంచే బీఆర్ఎస్ విజయ శంఖారావం

హైదరాబాద్, జూన్ 14 (విశ్వం న్యూస్) : బీఆర్ఎస్ పార్టీకి ఇది పరీక్షా సమయమని, ప్రతి కార్యకర్త బూత్ స్థాయిలో బాధ్యత తీసుకుని పార్టీ విజయానికి కృషి చేయాలని ఎమ్మెల్సీ డాక్టర్ దాసోజు శ్రవణ్ పిలుపునిచ్చారు. తెలంగాణ భవన్‌లో ఆయన ఆధ్వర్యంలో ఖైరతాబాద్ నియోజకవర్గానికి చెందిన ఆరు డివిజన్ల బూత్ స్థాయి కార్యకర్తల సమగ్ర సమన్వయ సమావేశం ఘనంగా నిర్వహించారు.

ఈ సమావేశానికి బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ముఖ్య అతిథిగా, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ విశిష్ట అతిథిగా హాజరయ్యారు. పలువురు సీనియర్ నాయకులు, మాజీ కార్పొరేటర్లు, విద్యార్థి విభాగం ప్రతినిధులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మాట్లాడిన డాక్టర్ దాసోజు శ్రవణ్, బీఎల్ఏలు మరియు సభ్యత్వ నమోదు ప్రక్రియలో సాంకేతిక కారణాల వల్ల కొద్దిమంది పేర్లు మాత్రమే నమోదు చేసినప్పటికీ, జాబితాలో పేర్లు లేని వారిని పార్టీ విస్మరించలేదని స్పష్టం చేశారు. ప్రతి కార్యకర్తకు పార్టీ అండగా ఉంటుందని, ఎలాంటి అభద్రతా భావానికి లోనుకావద్దని సూచించారు.

తెలంగాణ ఉద్యమాన్ని ప్రపంచ చరిత్రలోనే అరుదైన ప్రజాస్వామిక ఉద్యమంగా అభివర్ణించిన ఆయన, బీఆర్ఎస్ పార్టీ మరియు కేసీఆర్ నాయకత్వం తెలంగాణ సాధనలో కీలక పాత్ర పోషించాయని పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమంలో భాగస్వామ్యం కావడం ప్రతి కార్యకర్తకు గర్వకారణమని అన్నారు.

పార్టీ బలోపేతానికి బూత్ స్థాయి కార్యకర్తలే పునాదులని పేర్కొన్న ఆయన, బూత్ బలపడితే డివిజన్, డివిజన్ బలపడితే నియోజకవర్గం, నియోజకవర్గం బలపడితే రాష్ట్రంలో పార్టీ మరింత శక్తివంతంగా మారుతుందని తెలిపారు.

కార్యకర్తల్లో ఉత్సాహం నింపేందుకు “మేరా బూత్–మజ్బూత్”, “బూత్ మజ్బూత్–తో జీత్ నిశ్చిత్”, “హమారా బూత్–సబ్సే మజ్బూత్”, “బూత్ జీతా–చునావ్ జీతా” వంటి నినాదాలను సభలో ప్రతిధ్వనింపజేశారు.

చివరగా, “నా బూత్‌కు నేనే ఎమ్మెల్యే.. నేనే కార్పొరేటర్” అనే యాజమాన్య భావనతో ప్రతి కార్యకర్త పనిచేయాలని, ఖైరతాబాద్‌తో పాటు రాష్ట్రవ్యాప్తంగా పార్టీని విజయతీరాలకు చేర్చాలని డాక్టర్ దాసోజు శ్రవణ్ పిలుపునిచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *