మెట్రో టేకోవర్‌పై విచారణ జరపాలి: దాసోజు శ్రవణ్

హైదరాబాద్, జూన్ 17 (విశ్వం న్యూస్) : హైదరాబాద్ మెట్రో రైలు టేకోవర్ వ్యవహారంలో పారదర్శకత పాటించకుండా వేల కోట్ల ప్రజాధనాన్ని ఖర్చు చేస్తున్నారని, మెట్రో కొనుగోలు ప్రక్రియతో పాటు జపాన్ సంస్థ నుంచి తీసుకుంటున్నట్లు చెబుతున్న రుణంపై సమగ్ర విచారణ జరగాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ డా. దాసోజు శ్రవణ్ డిమాండ్ చేశారు.

గత కేసీఆర్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అభివృద్ధి చేసిన మెట్రో రైలు వ్యవస్థను ప్రస్తుత ప్రభుత్వం తప్పుదోవ పట్టిస్తోందని ఆయన విమర్శించారు. ఎల్ అండ్ టీ నుంచి మెట్రో టేకోవర్ విషయంలో ప్రజలకు పూర్తి వివరాలు వెల్లడించడం లేదని ఆరోపించారు.

హైటెక్ సిటీ–శంషాబాద్ ఎయిర్‌పోర్టు మెట్రో మార్గాన్ని గతంలో రద్దు చేసిన ప్రభుత్వం, ఇప్పుడు కొత్త ప్రాంతాల కోసం మెట్రో నిర్మాణం చేపడతామని చెప్పడం విరుద్ధ వైఖరికి నిదర్శనమని పేర్కొన్నారు.

మెట్రో టేకోవర్ కోసం ఎల్ అండ్ టీకి ఈక్విటీ కింద, ఐఆర్ఎఫ్సీకి మార్జిన్ మనీ, బ్రోకరేజ్ ఫీజుల రూపంలో వేల కోట్ల రూపాయలు ముందుగానే చెల్లించారని, అయితే రుణం ఇంకా పూర్తిగా మంజూరు కాకముందే ఈ చెల్లింపులు ఎలా జరిగాయో ప్రభుత్వం వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు.

రూ.13,600 కోట్ల రుణం ఇస్తున్న జపాన్ సంస్థ పేరు, స్వరూపం, ఒప్పంద వివరాలను వెంటనే బహిర్గతం చేయాలని కోరారు. ఈ వ్యవహారంపై రాష్ట్ర కేబినెట్ అనుమతి తీసుకున్నారా లేదా అనే విషయాన్ని కూడా స్పష్టం చేయాలని అన్నారు.

మెట్రో పరిధిలోని 280 ఎకరాల భూమి, 57 స్టేషన్లు, వాణిజ్య సముదాయాల నిర్వహణపై ప్రభుత్వ ప్రణాళిక ఏమిటో ప్రజలకు తెలియజేయాలని డిమాండ్ చేశారు. మెట్రో టేకోవర్, రుణ ఒప్పందాలు, ఆస్తుల నిర్వహణకు సంబంధించిన అన్ని పత్రాలను ప్రజల ముందుంచి పారదర్శకత పాటించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని డా. దాసోజు శ్రవణ్ కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *