అభిమానం గెలిచింది.. పవన్ మనసు కరిగింది

- హనుమకొండలో అరుదైన వ్యాధితో బాధపడుతున్న యువకుడిని పరామర్శించిన డిప్యూటీ సీఎం
హనుమకొండ, జూన్ 17: అరుదైన డీఎన్డీ (DND) జన్యుపరమైన వ్యాధితో బాధపడుతూ మంచానికే పరిమితమైన తన అభిమాని కోరికను ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి Pawan Kalyan పవన్ కళ్యాణ్ నెరవేర్చారు. హనుమకొండకు చెందిన 17 ఏళ్ల నిరంజన్ తన చివరి కోరికగా పవన్ కళ్యాణ్‌ను కలవాలని కోరుకోవడంతో, ఆయన స్వయంగా నిరంజన్ ఇంటికి వెళ్లి పరామర్శించారు.
తెలంగాణ జనసేన నాయకుల ద్వారా విషయం తెలుసుకున్న పవన్ కళ్యాణ్, నిరంజన్ను ఆప్యాయంగా దగ్గరకు తీసుకుని మాట్లాడారు. అతని ఆరోగ్య పరిస్థితి గురించి తల్లిదండ్రులు పొనుగోటి రాంగోపాల్, మానసలను అడిగి తెలుసుకున్నారు. వైద్యపరంగా మరింత సహాయం అందించేందుకు ఏం చేయవచ్చో ఆరా తీశారు.
నిరంజన్‌కు తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి తీర్థప్రసాదాలు అందజేసిన పవన్, భగవంతుని ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు. వైద్య ఖర్చుల నిమిత్తం రూ.1 లక్షల ఆర్థిక సాయం అందజేశారు. అలాగే నిరంజన్ ఆరోగ్యం కోసం వరంగల్ భద్రకాళి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తానని తెలిపారు.
“చిన్నప్పటి నుంచి మీరంటే ఎంతో అభిమానం” అని నిరంజన్ చెప్పడంతో పవన్ కళ్యాణ్ భావోద్వేగానికి గురైనట్లు జనసేన నాయకులు తెలిపారు. తిరుమల నుంచి తెప్పించిన వస్త్రాన్ని నిరంజన్‌కు కప్పి, కళ్యాణ అక్షతలు అందించి ఆశీర్వదించారు.
ఈ సందర్భంగా నిరంజన్ కుటుంబ పరిస్థితులను కూడా పవన్ తెలుసుకున్నారు.గతంలో కాకతీయ ఆసుపత్రి క్యాంటీన్లో పనిచేశామని తల్లిదండ్రులు చెప్పగా, వారి జీవనోపాధి మెరుగుపడేలా క్యాంటీన్ ఏర్పాటు చేయాలని జనసేన తెలంగాణ రాష్ట్ర నాయకులకు సూచించారు.
పవన్ కళ్యాణ్ మానవతా దృక్పథంతో స్పందించి అభిమాని కోరిక తీర్చడం స్థానికులను, జనసేన శ్రేణులను భావోద్వేగానికి గురిచేసింది.