
హైదరాబాద్, జూన్ 22 (విశ్వం న్యూస్) : కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో ప్రకటిస్తున్న విధానాలకు, తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమలు చేస్తున్న చర్యలకు మధ్య తీవ్ర వైరుధ్యం ఉందని బీఆర్ఎస్ నేత డాక్టర్ దాసోజు శ్రవణ్ కుమార్ ఆరోపించారు. ఈ మేరకు లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి బహిరంగ లేఖ రాశారు.

డొనాల్డ్ ట్రంప్‌పై ఏఐసీసీ తీవ్ర విమర్శలు చేస్తూ భారత సార్వభౌమాధికారాన్ని దెబ్బతీసే విధంగా అమెరికా వ్యవహరిస్తోందని ఆరోపిస్తుండగా, తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్‌లో “డొనాల్డ్ ట్రంప్ ఎవెన్యూ” పేరుతో రహదారి ప్రారంభించడానికి సిద్ధమవడం కాంగ్రెస్ ద్వంద్వ వైఖరికి నిదర్శనమని దాసోజు పేర్కొన్నారు.
జాతీయ స్థాయిలో ట్రంప్ విధానాలను ఖండిస్తూ, రాష్ట్ర స్థాయిలో ఆయన పేరును రహదారికి పెట్టడం ఎలా సమర్థనీయమని ప్రశ్నించారు. పెట్టుబడులను ఆకర్షించేందుకు రహదారులకు పేర్లు పెట్టడం కాకుండా, పారిశ్రామిక అనుకూల విధానాలు, నాణ్యమైన విద్యుత్, మెరుగైన మౌలిక సదుపాయాలు అవసరమని అన్నారు.
అలాగే, ఉత్తరప్రదేశ్‌లో బుల్డోజర్ రాజకీయాలను కాంగ్రెస్ వ్యతిరేకిస్తుంటే, తెలంగాణలో అదే విధానాలను ప్రోత్సహించడం కూడా పార్టీ వైఖరిలోని విరుద్ధతేనని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ సిద్ధాంతాలను తెలంగాణలో రేవంత్ రెడ్డి విస్మరిస్తున్నారా? లేక రాష్ట్ర కాంగ్రెస్‌ను స్వతంత్ర రాజకీయ ఫ్రాంచైజీలా నడుపుతున్నారా? అనే అంశాలపై రాహుల్ గాంధీ స్పష్టత ఇవ్వాలని దాసోజు శ్రవణ్ కుమార్ తన లేఖలో డిమాండ్ చేశారు.