యోగతో ఆరోగ్య భాగ్యం

హైదరాబాద్, జూన్ 21 (విశ్వం న్యూస్)-అత్తాపూర్‌లో 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. రాజేంద్రనగర్ డివిజన్ పరిధిలోని లక్ష్మీనగర్ పార్కులో అత్తాపూర్ యోగా సెంటర్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో తెలంగాణ ఎకనామిక్ ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు, రచయిత-కాలమిస్ట్ నేదునూరి కనకయ్య ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యోగ భారతదేశం ప్రపంచానికి అందించిన గొప్ప కానుక అని, ప్రతి వ్యక్తి యోగను జీవనశైలిలో భాగం చేసుకోవాలని సూచించారు. యోగ శరీరానికి దివ్య ఔషధంగా, మనసుకు ప్రశాంతతను అందించే ఉత్తమ సాధనంగా నిలుస్తుందని పేర్కొన్నారు.
కార్యక్రమానికి అధ్యక్షత వహించిన అత్తాపూర్ యోగా సెంటర్ గురువు పి. మహేందర్ మాట్లాడుతూ నిరంతర యోగ సాధన ద్వారా శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక స్థిరత్వం కూడా పెరుగుతుందని అన్నారు. అత్తాపూర్ వాకింగ్ అసోసియేషన్ అడ్వైజర్ యు. నరసింహారావు, బీజేపీ నాయకులు కొమురయ్య, మల్లారెడ్డి శ్రీధర్, ప్రముఖ సంఘసేవకుడు, సీనియర్ పాత్రికేయుడు మధు, రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం మాజీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ రాఘవరెడ్డి తదితరులు యోగ ప్రాముఖ్యతను వివరించారు.
యోగ దినోత్సవం సందర్భంగా సభ్యులు సామూహికంగా సూర్యనమస్కారాలు, వృక్షాసనం, చక్రాసనం తదితర యోగాసనాలను ప్రదర్శించారు. ఉచిత యోగ శిక్షణ అందిస్తున్న గురువు పి. మహేందర్‌ను సభ్యులు శాలువాలు, పూలమాలలతో ఘనంగా సన్మానించారు. అలాగే పలువురు సీనియర్ యోగా సభ్యులను కూడా సత్కరించారు.