ఒకే వ్యక్తికి రెండు ఓట్లు ఉంటే ఏడాది జైలు శిక్ష తప్పదు: దాసోజు శ్రవణ్

ఒకే వ్యక్తికి రెండు ఓట్లు ఉంటే ఏడాది జైలు శిక్ష తప్పదు: దాసోజు శ్రవణ్

  • ఎస్‌ఐఆర్‌ ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించాలి:
    ఎన్నికల సంఘానికి బీఆర్‌ఎస్ విజ్ఞప్తి

హైదరాబాద్, జూన్ 23 (విశ్వం న్యూస్): రాష్ట్రంలో దొంగ, డూప్లికేట్ ఓట్ల వ్యవస్థను పూర్తిగా నిర్మూలిస్తామని బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ డాక్టర్ దాసోజు శ్రవణ్ స్పష్టం చేశారు. జూన్ 25 నుంచి ప్రారంభం కానున్న ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) కార్యక్రమం నేపథ్యంలో బీఆర్‌ఎస్ ప్రతినిధి బృందం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారిని కలిసి వినతిపత్రం సమర్పించింది.

ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన దాసోజు శ్రవణ్, ఒకే వ్యక్తి రెండు చోట్ల ఓటు కలిగి ఉండటం ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం శిక్షార్హమైన నేరమని పేర్కొన్నారు. ఇలాంటి అక్రమాలు రుజువైతే ఏడాది వరకు జైలు శిక్ష విధించే అవకాశం ఉందని హెచ్చరించారు. హైదరాబాద్‌లో నివసిస్తూ ఇతర రాష్ట్రాల్లోనూ ఓటు హక్కు కొనసాగిస్తున్న వారి వివరాలను గుర్తించి తొలగించాలని ఎన్నికల సంఘాన్ని కోరారు.

గతంలో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బీఆర్‌ఎస్ ఫిర్యాదుల మేరకు వేలాది బోగస్ ఓట్లను తొలగించిన విషయాన్ని గుర్తుచేసిన ఆయన, అదే తరహాలో రాష్ట్రవ్యాప్తంగా క్షేత్రస్థాయి పరిశీలన చేపట్టాలని డిమాండ్ చేశారు. ఓటరు జాబితా పారదర్శకత, విశ్వసనీయత కోసం 15 డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని ఎన్నికల సంఘానికి సమర్పించినట్లు తెలిపారు.

నిజమైన ఓటర్ల పేర్లను ముందస్తు నోటీసు లేకుండా తొలగించరాదని, ద్వంద్వ నమోదులను గుర్తించేందుకు ఆధునిక డిజిటల్ సాంకేతిక వ్యవస్థలను వినియోగించాలని సూచించారు. ఎస్‌ఐఆర్ ప్రక్రియలో భాగంగా కేటీఆర్, హరీశ్‌రావు నేతృత్వంలో రాష్ట్రవ్యాప్తంగా పార్టీ శ్రేణులకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.

త్వరలోనే ఈ అంశంపై కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసి సమగ్ర నివేదిక సమర్పించనున్నట్లు దాసోజు శ్రవణ్ తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *