తమ్ముడిని బాగా చూసుకోమంటూ చివరి వీడియోకాల్.. రైలు కిందపడి దంపతుల బలవన్మరణం

హైదరాబాద్, జూలై 4 (విశ్వం న్యూస్): ఆర్థిక ఇబ్బందులు, అప్పుల ఒత్తిడి, అవమానాలు భరించలేక ఓ దంపతులు రైలు కిందపడి బలవన్మరణానికి పాల్పడిన విషాద ఘటన అందరినీ కలచివేసింది. మరణానికి ముందు తమ ఇద్దరు చిన్నారులకు వీడియోకాల్ చేసి, “తమ్ముడిని బాగా చూసుకో.. వాడిని ఎప్పుడూ కొట్టకు” అంటూ పెద్ద కుమారుడికి చెప్పిన చివరి మాటలు హృదయాలను కదిలిస్తున్నాయి.

వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం పాపాయ్యపేటకు చెందిన రవికుమార్ (42), శిరీష (33) దంపతులు ఉపాధి కోసం హైదరాబాద్‌కు వచ్చి హయత్‌నగర్ సమీపంలోని కుంట్లూర్‌లో స్థిరపడ్డారు. చైతన్యపురిలో బియ్యం వ్యాపారం నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్న రవికుమార్, ఇటీవల వ్యాపార నష్టాలు ఎదుర్కోవడంతో అప్పుల పాలయ్యారు. అదనపు ఆదాయం కోసం కొనుగోలు చేసిన రెడీమిక్స్ వాహనం ప్రమాదానికి గురికావడంతో ఆర్థిక పరిస్థితి మరింత దిగజారింది.

గురువారం ఉదయం కొందరు మహిళలు వారి ఇంటి వద్దకు వచ్చి తీవ్ర వాగ్వాదానికి దిగినట్లు సమాచారం. ఈ ఘటనతో తీవ్ర మనస్తాపానికి గురైన దంపతులు తమ పరిస్థితిని సమీప వ్యాపారుల వద్ద వాపోయినట్లు తెలుస్తోంది. అదే రోజు సాయంత్రం తమ ఇద్దరు కుమారులకు వీడియోకాల్ చేసి ప్రేమగా మాట్లాడిన అనంతరం ఇంటికి వస్తామని చెప్పి కాల్ ముగించారు.

అయితే రాత్రి బీబీనగర్ రైల్వే స్టేషన్ సమీపంలో రైలు కిందపడి ఇద్దరూ బలవన్మరణానికి పాల్పడ్డారు. వారి మరణంతో ఇద్దరు చిన్నారులు అనాథలయ్యారు.

దంపతుల ఆత్మహత్యకు వ్యాపార భాగస్వాములతో ఆర్థిక వివాదాలు, కొందరు మహిళల వేధింపులే కారణమని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఘటన అనంతరం ఆరోపణలు ఎదుర్కొంటున్న మహిళలు ఇళ్లకు తాళాలు వేసి వెళ్లిపోయినట్లు స్థానికులు చెబుతున్నారు.

రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. ఘటన వెనుక అసలు కారణాలపై పూర్తి వివరాలు దర్యాప్తులో వెల్లడికానున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *