కాళేశ్వరం నీళ్లపై
బీఆర్ఎస్ పోరుబాట

హైదరాబాద్, జూలై 4 (విశ్వం న్యూస్) : కాళేశ్వరం ప్రాజెక్టు పంప్‌హౌస్‌లను వెంటనే ప్రారంభించి రైతులకు సాగునీరు అందించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కన్నెపల్లి పంప్‌హౌస్‌ను సందర్శించిన అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో తీవ్ర కరువు పరిస్థితులు నెలకొన్నప్పటికీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. గోదావరి నీరు లక్షల క్యూసెక్కులుగా సముద్రంలో కలుస్తున్నా రైతులకు నీరు ఇవ్వడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు.

రైతుల కోసం తాము కన్నెపల్లి పంప్‌హౌస్‌కు వస్తుంటే పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకున్నారని కేటీఆర్ ఆరోపించారు. ప్రభుత్వం వెంటనే పంపులను ప్రారంభించి జలాశయాలను నింపకపోతే 50 నుంచి 60 వేల మంది రైతులతో కలిసి కన్నెపల్లి పంప్‌హౌస్‌ను ముట్టడించి తామే పంపులను ఆన్ చేస్తామని హెచ్చరించారు. రైతు ప్రయోజనాల కంటే రాజకీయాలకు ప్రాధాన్యం ఇవ్వడం తగదని, కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి స్థాయిలో వినియోగించి సాగునీరు విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.