కన్నెపల్లి పర్యటనలో గాయపడిన
ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు

జయశంకర్ భూపాలపల్లి, జూలై 5 (విశ్వం న్యూస్) : కాళేశ్వరం ప్రాజెక్టులోని కన్నెపల్లి లక్ష్మి పంప్‌హౌస్ పరిశీలనకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతృత్వంలో వెళ్తున్న పార్టీ నేతల కాన్వాయ్‌లో ఆదివారం అపశృతి చోటుచేసుకుంది. యాదాద్రి భువనగిరి జిల్లా వీరా హోటల్ సమీపంలో కాన్వాయ్‌లోని రెండు వాహనాలు ఒకదానికొకటి ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు శంభీపూర్ రాజు గాయపడ్డారు.
ప్రమాదంలో కారు తగలడంతో ఆయన కిందపడగా, ఛాతి భాగంలో గాయాలు అయ్యాయి. వెంటనే సహచర నేతలు ఆయనను ప్రాథమిక చికిత్స అనంతరం హైదరాబాద్ కొంపల్లిలోని కిమ్స్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు.
కేటీఆర్‌తో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ముఖ్య నేతలు జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్‌పూర్ మండలంలోని కన్నెపల్లి లక్ష్మి పంప్‌హౌస్‌ను పరిశీలించేందుకు హైదరాబాద్ నుంచి బయలుదేరిన సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఘటనతో కాన్వాయ్‌లో స్వల్ప కలకలం నెలకొన్నప్పటికీ, అనంతరం నేతలు తమ పర్యటనను కొనసాగించారు.