జాతీయ కాంగ్రెస్ ప్రభుత్వమా లేక బీజేపీ కనుసన్నల్లో నడిచే రేవంత్ ఫ్రాంచైజీనా?” రాహుల్‌కు దాసోజు ప్రశ్నలు

హైదరాబాద్, జూలై 4 (విశ్వం న్యూస్) : తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ డాక్టర్ దాసోజు శ్రవణ్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి శనివారం బహిరంగ లేఖ రాసిన ఆయన, కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన VB-G RAM G (జీ రామ్ జీ) విధానాన్ని జాతీయ స్థాయిలో కాంగ్రెస్ వ్యతిరేకిస్తుండగా, తెలంగాణలో అదే విధానాన్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వం క్యాబినెట్‌లో ఆమోదించడం పార్టీ ద్వంద్వ వైఖరికి నిదర్శనమని ఆరోపించారు.

ఏఐసీసీ అధికారిక విధానానికి విరుద్ధంగా తెలంగాణ ప్రభుత్వం వ్యవహరిస్తోందని, ఇది బీజేపీతో ఉన్న లోపాయికారీ రాజకీయ ఒప్పందాన్ని సూచిస్తోందని దాసోజు శ్రవణ్ పేర్కొన్నారు. పెండింగ్‌లో ఉన్న ఫీల్డ్ అసిస్టెంట్ల జీతాలు వెంటనే విడుదల చేయాలని, వారికి ఉద్యోగ భద్రత కల్పించాలని, ఉపాధి కూలీల దినసరి వేతనాన్ని రూ.400కు పెంచాలని డిమాండ్ చేశారు.

రేవంత్ రెడ్డి ప్రభుత్వం “జీ రామ్ జీ” విధానానికి ఇచ్చిన ఆమోదాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని, లేకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఫీల్డ్ అసిస్టెంట్లు, ఉపాధి కూలీల సమస్యలపై బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఉధృత ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *