మల్లారెడ్డి మౌనం వెనుక మర్మమేంటి..?

హైదరాబాద్, జూలై 6 (విశ్వం న్యూస్) : తెలంగాణ రాజకీయాల్లో మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి పార్టీ మార్పుపై ఊహాగానాలు మరోసారి జోరందుకున్నాయి. గత కొంతకాలంగా బీఆర్ఎస్ అధిష్ఠానం నిర్వహిస్తున్న కీలక సమావేశాలు, నిరసన కార్యక్రమాలకు ఆయన దూరంగా ఉండటం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ముఖ్యంగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో జరుగుతున్న కార్యక్రమాల్లో మల్లారెడ్డి కనిపించకపోవడం పలు సందేహాలకు తావిస్తోంది.

ఇటీవల కార్యకర్తలతో మాట్లాడుతూ “నేను క్రమంగా బీఆర్ఎస్‌కు దూరమవుతున్నానని మీరు అనుకుంటున్నారు” అంటూ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పార్టీ మార్పుపై ప్రచారం మరింత ఊపందుకుంది. అధికారంలో ఉన్నప్పుడు పార్టీకి కీలక నేతగా వ్యవహరించిన మల్లారెడ్డి, ప్రస్తుతం రాజకీయంగా కొత్త అవకాశాలను పరిశీలిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది.

మరోవైపు ఆయన కోడలు డాక్టర్ ప్రీతి రెడ్డి ప్రధాని నరేంద్ర మోదీపై ప్రశంసలు కురిపించడం, బీజేపీ నాయకులతో భేటీ కావడం కూడా రాజకీయ చర్చకు దారితీసింది. దీంతో మల్లారెడ్డి కుటుంబం బీఆర్ఎస్‌ను వీడి కాంగ్రెస్ లేదా బీజేపీలో చేరే అవకాశాలపై ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే ఈ ప్రచారాన్ని కుటుంబ సభ్యులు ఖండిస్తున్నారు.

వచ్చే ఎన్నికలు, మహిళా రిజర్వేషన్లు, నియోజకవర్గాల పునర్విభజన వంటి పరిణామాల నేపథ్యంలో తమ కుటుంబానికి రాజకీయంగా అనుకూలమైన నిర్ణయం తీసుకునే ఆలోచనలో మల్లారెడ్డి ఉన్నారనే ప్రచారం కొనసాగుతోంది. అయితే మల్లారెడ్డి తాజా వ్యాఖ్యలు కేవలం రాజకీయ వ్యూహమా? లేక పార్టీ మార్పుకు సంకేతమా? అన్నది ప్రస్తుతం ఆసక్తికర చర్చగా మారింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *