పోక్సో కేసు నిందితుడి రక్తపాతం

రంగారెడ్డి, జూలై 11 (విశ్వం న్యూస్): రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం దైవాలగూడలో చోటుచేసుకున్న ఆరుగురు హత్యల ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. పోక్సో కేసులో బెయిల్‌పై బయటకు వచ్చిన నిందితుడు రాజ్‌కుమార్ శుక్రవారం రాత్రి సుమారు 11 గంటల నుంచి అర్ధరాత్రి ఒంటి గంట వరకు వరుసగా ఆరుగురిని అత్యంత దారుణంగా హత్య చేసినట్లు దర్యాప్తు అధికారులు ప్రాథమికంగా గుర్తించారు.

మైనర్ బాలికను మభ్యపెట్టి తీసుకెళ్లిన నిందితుడు : దర్యాప్తు అధికారుల సమాచారం ప్రకారం, రాజ్‌కుమార్ ముందుగా మైనర్ బాలిక ఇంటికి వెళ్లాడు. బయటకు వెళ్దామని చెప్పి ఆమెను కారులో తీసుకెళ్లాడు. బాలిక అమ్మమ్మ, నాయనమ్మ అడ్డుకున్నప్పటికీ, “వెంటనే వచ్చేస్తాం” అంటూ వారిని నమ్మించి అక్కడి నుంచి తీసుకెళ్లినట్లు పోలీసులు తెలిపారు.

చెరువు వద్ద దారుణం : గ్రామానికి సుమారు మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న చెరువు వద్దకు బాలికను తీసుకెళ్లిన రాజ్‌కుమార్, ఆమెపై లైంగిక దాడికి పాల్పడి అనంతరం గొంతు కోసి హత్య చేసినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది.

  • సీసీటీవీ ఫుటేజ్.. షాబాద్ పోక్సో హత్యల ఘటనలో నిందితుడు బాలికను లాక్కెళ్లిన దృశ్యాలు

బాలిక ఇంట్లో మరో ఇద్దరి హత్య : అక్కడి నుంచి అదే కారులో తిరిగి బాలిక ఇంటికి చేరుకున్న నిందితుడు, ఇంట్లో ఉన్న అమ్మమ్మ రుక్మిణి, నాయనమ్మ లక్ష్మిని కత్తితో అత్యంత కిరాతకంగా హత్య చేశాడు. అనంతరం అక్కడి నుంచి నేరుగా తన ఇంటికి వెళ్లాడు.

భార్యను వెంబడించి హత్య : తన ఇంటికి చేరుకునే ముందు భార్యకు ఫోన్ చేసి పిల్లలను చూడాలని చెప్పిన రాజ్‌కుమార్, ఇంట్లోకి వెళ్లగానే భార్యపై కత్తితో దాడి చేశాడు. ప్రాణాలు కాపాడుకునేందుకు ఆమె బయటకు పరుగెత్తినా, వెంటాడి మళ్లీ ఇంట్లోకి తీసుకువచ్చి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు.

  • ఈ.. పసిబిడ్డలను చంపడానికి ఆ..పాపాత్మునికి చేతులెలా వచ్చాయి..‌

ఇద్దరు చిన్నారులనూ విడిచిపెట్టలేదు : భార్యను హత్య చేసిన అనంతరం, తన ఇద్దరు చిన్నారుల గొంతులు కోసి చంపాడు. ఇలా వరుసగా ఆరుగురిని హతమార్చిన తర్వాత కారులో అక్కడి నుంచి పరారయ్యాడు.

తండ్రికి ఫోన్ చేసి నేరం ఒప్పుకున్న రాజ్‌కుమార్ : పారిపోతూ తన తండ్రికి ఫోన్ చేసిన రాజ్‌కుమార్, భార్య, పిల్లలు, ప్రియురాలు, ఆమె అమ్మమ్మ, నాయనమ్మను తానే హత్య చేసినట్లు చెప్పినట్లు పోలీసులు వెల్లడించారు. అనంతరం తాను కూడా ఆత్మహత్య చేసుకుంటానని చెప్పి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసినట్లు సమాచారం.

ఐదు ప్రత్యేక బృందాలతో గాలింపు: నిందితుడి కోసం పోలీసులు ఐదు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి విస్తృతంగా గాలిస్తున్నారు. ఘటనకు గల పూర్తి కారణాలు, హత్యలకు దారితీసిన పరిస్థితులపై పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

  • దారుణ హత్యాకాండ ఘటనాస్థలికి వెళ్లకుండా మాజీ మంత్రుల అడ్డగింత
  • షాబాద్ మండలంలోని దారుణ హత్యాకాండ జరిగిన ప్రాంతాన్ని సందర్శించేందుకు బయలుదేరిన మాజీ మంత్రులు సత్యవతి రాథోడ్, సబితా ఇంద్రారెడ్డిలను పోలీసులు మార్గమధ్యంలో అడ్డుకుని అరెస్ట్ చేశారు.
  • ఈ సందర్భంగా మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ, పోలీసుల తీరును, రాష్ట్ర ప్రభుత్వ అసమర్థ వైఖరిని తీవ్రంగా ఖండించారు. శాంతిభద్రతల పరిరక్షణలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని ఆమె డిమాండ్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *