భోజనానికి వెళ్లి.. శవంగా ఇంటికి

హైదరాబాద్, జూలై 11 (విశ్వం న్యూస్) : గచ్చిబౌలి పరిధిలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో వాటర్ ట్యాంకర్ ఢీకొట్టడంతో ఓ యువతి మృతి చెందగా, మరో యువతి తీవ్రంగా గాయపడింది. గచ్చిబౌలి ఇన్‌స్పెక్టర్ బాలరాజు తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం కాట్రపల్లికి చెందిన మల్లం భవాని (23) ఇందిరానగర్‌లోని పీజీ హాస్టల్‌లో ఉంటూ టెలికాం నగర్‌లోని గోకలర్స్‌లో సేల్స్ గర్ల్‌గా పనిచేస్తోంది.

మరో సేల్స్ గర్ల్ ఎస్. సుహాసిని (30) అంజయ్య నగర్‌లోని లక్ష్మీ హాస్టల్‌లో నివాసం ఉంటోంది. గురువారం రాత్రి సుమారు 11.20 గంటల సమయంలో ఇద్దరూ కలిసి భోజనం కోసం ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా, ట్రిపుల్ ఐటీ నుంచి గచ్చిబౌలి ఫ్లైఓవర్ సమీపంలో వెనుక నుంచి వేగంగా వచ్చిన వాటర్ ట్యాంకర్ వారి వాహనాన్ని ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో వెనుక కూర్చున్న భవాని ట్యాంకర్ టైరు కింద పడటంతో అక్కడికక్కడే మృతి చెందింది. వాహనం నడుపుతున్న సుహాసినికి తీవ్ర గాయాలు కాగా, ఆమెను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *