అద్దంకి దయాకర్, బల్ముర్ వెంకట్‌లకు రాష్ట్ర మంత్రి హోదా

- తెలంగాణ ప్రభుత్వం
ఉత్తర్వులు జారీ
హైదరాబాద్, జూలై 15 (విశ్వం న్యూస్): కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీలు అద్దంకి దయాకర్, బల్ముర్ వెంకట్‌లకు రాష్ట్ర మంత్రి హోదా కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ (జీఏడీ) బుధవారం అధికారికంగా ఉత్తర్వులు విడుదల చేసింది.

ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం అద్దంకి దయాకర్, బల్ముర్ వెంకట్‌లు తమ ఎమ్మెల్సీ పదవీకాలం పూర్తయ్యే వరకు రాష్ట్ర మంత్రి హోదాతో కొనసాగనున్నారు. మంత్రి హోదాకు అనుగుణంగా వారికి ప్రోటోకాల్, అధికారిక సౌకర్యాలు, ఇతర హక్కులు వర్తించనున్నాయి.
కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలు, ప్రభుత్వ విధానాల ప్రచారంలో చురుకైన పాత్ర పోషిస్తున్న ఈ ఇద్దరు నాయకులకు మంత్రి హోదా కల్పించడం రాజకీయ వర్గాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పార్టీ శ్రేణుల్లో హర్షాతిరేకాలను కలిగించింది.
మంత్రి హోదా లభించడంతో రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు అద్దంకి దయాకర్, బల్ముర్ వెంకట్‌లకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు వెంటనే అమల్లోకి వచ్చినట్లు అధికారులు వెల్లడించారు.