జర్నలిస్టుల సమస్యలపై రాష్ట్రవ్యాప్త నిరసన

హైదరాబాద్, జూలై 13 (విశ్వం న్యూస్): జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) ఆధ్వర్యంలో సోమవారం రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన నిరసన కార్యక్రమం విజయవంతమైంది. హైదరాబాద్‌తో పాటు పలు జిల్లాల్లో వందలాది మంది పాత్రికేయులు కలెక్టరేట్ల ఎదుట ఆందోళన నిర్వహించి, జిల్లా కలెక్టర్లకు వినతిపత్రాలు అందజేశారు.

పెండింగ్‌లో ఉన్న అక్రిడిటేషన్ కార్డుల జారీని వేగవంతం చేయాలని, జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు కేటాయించాలని, హెల్త్ కార్డులు అందించాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆర్టీసీ బస్సు పాసులను పూర్తిగా ఉచితం చేయడంతో పాటు మెట్రో రైల్ పాసులు మంజూరు చేయాలని, జాతీయ రహదారులపై టోల్ ఫీజు నుంచి జర్నలిస్టులకు మినహాయింపు కల్పించాలని కోరారు.
హైదరాబాద్, రంగారెడ్డి, వరంగల్, ఖమ్మం, నిజామాబాద్, సంగారెడ్డి, మహబూబ్‌నగర్, కరీంనగర్ తదితర జిల్లాల్లో జరిగిన నిరసనల్లో పెద్ద సంఖ్యలో జర్నలిస్టులు పాల్గొన్నారు. రెండు గంటల పాటు కలెక్టరేట్ల ఎదుట ధర్నా నిర్వహించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ఈ సందర్భంగా టీడబ్ల్యూజేఎఫ్ యాక్టింగ్ ప్రెసిడెంట్ పి. రాంచందర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి. బసవపున్నయ్య మాట్లాడుతూ, నాలుగు దశాబ్దాలుగా జర్నలిస్టులకు ఇండ్ల స్థలాల సమస్య పరిష్కారం కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అక్రిడిటేషన్ కార్డుల జారీలో యూనియన్ రాజకీయాలు చేయకుండా అర్హులైన అందరికీ న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.
ఈ నెల 15న హైదరాబాద్‌లోని సమాచార, పౌరసంబంధాల శాఖ కార్యాలయం (సమాచార్ భవన్) ఎదుట “ఛలో సమాచార్ భవన్” కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ప్రకటిస్తూ, రాష్ట్రవ్యాప్తంగా జర్నలిస్టులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.