భోరుమని ఏడ్చిన నర్సంపేట..!

- పెద్ది సుదర్శన్ రెడ్డికి కన్నీటి వీడ్కోలు.. జనసంద్రంగా మారిన నర్సంపేట
నర్సంపేట, జూలై 31: నర్సంపేట మాజీ ఎమ్మెల్యే, సీనియర్ రాజకీయ నాయకుడు పెద్ది సుదర్శన్ రెడ్డి భౌతికకాయం నర్సంపేటకు చేరుకోగానే ఆ ప్రాంతమంతా విషాద ఛాయలు అలుముకున్నాయి. తన ఆత్మీయ నాయకుడిని కడసారి చూసేందుకు వేలాదిగా తరలివచ్చిన ప్రజలు, కార్యకర్తలు, అభిమానులతో నర్సంపేట జనసంద్రంగా మారింది. “సుదర్శన్ రెడ్డి అమర్ రహే” అంటూ నినాదాలు చేస్తూ అభిమానులు భావోద్వేగానికి గురయ్యారు.
భౌతికకాయం చేరుకున్న వెంటనే కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు. మహిళలు, వృద్ధులు, యువకులు సైతం తమ అభిమాన నాయకుడికి కడసారి నివాళులర్పిస్తూ భోరున విలపించారు. నర్సంపేట పట్టణంలోని ప్రతి వీధి, ప్రతి కూడలి విషాదంలో మునిగిపోయింది. తన రాజకీయ జీవితంలో ప్రజలతో మమేకమై, అందరికీ అందుబాటులో ఉండే నాయకుడిగా పేరు తెచ్చుకున్న సుదర్శన్ రెడ్డి మరణ వార్త స్థానికులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.
పెద్ది సుదర్శన్ రెడ్డి రాజకీయాలకు అతీతంగా ప్రజల మనిషిగా గుర్తింపు పొందారు. అవసరంలో ఉన్న వారికి అండగా నిలవడం, ప్రజా సమస్యలపై పోరాడటం ఆయన వ్యక్తిత్వానికి నిదర్శనంగా నిలిచాయి. అందుకే ఆయన భౌతికకాయం నర్సంపేటకు చేరుకున్న సమయంలో ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి తమ అభిమానాన్ని, అనుబంధాన్ని కన్నీటి రూపంలో వ్యక్తం చేశారు.
రాష్ట్రంలోని పలువురు రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీల నేతలు, సామాజిక సంస్థల ప్రతినిధులు సుదర్శన్ రెడ్డి భౌతికకాయానికి నివాళులర్పించారు. ఆయన మరణం నర్సంపేటకు తీరని లోటని, ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయే నాయకుడని కొనియాడారు.
పెద్ది సుదర్శన్ రెడ్డి అంతిమయాత్రకు వేలాదిగా ప్రజలు హాజరుకానుండగా, నర్సంపేట మొత్తం దుఃఖసాగరంలో మునిగిపోయింది. తమ అభిమాన నాయకుడిని కోల్పోయిన బాధతో ప్రజలు కన్నీటి వీడ్కోలు పలుకుతున్నారు. “నాయకుడు వెళ్లిపోయాడు.. కానీ ఆయన సేవలు, జ్ఞాపకాలు చిరస్థాయిగా నిలిచిపోతాయి” అంటూ ప్రజలు భావోద్వేగంతో నివాళులర్పించారు.