విద్యాశాఖకు ప్రత్యేక మంత్రి నియమించాలి: మల్క కొమరయ్య

విద్యాశాఖకు ప్రత్యేక మంత్రి నియమించాలి: మల్క కొమరయ్య

హైదరాబాద్, జూలై 31: రాష్ట్రంలో విద్యా వ్యవస్థను ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేస్తోందని, విద్యాశాఖకు ప్రత్యేక మంత్రిని వెంటనే నియమించాలని బీజేపీ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ మల్క కొమరయ్య డిమాండ్ చేశారు. నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం విద్యారంగానికి ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటీ అమలు కాలేదని విమర్శించారు.

టీచర్ల బదిలీలు, పదోన్నతులు, 317 జీవో సమస్యలు, డీఏలు, పీఆర్సీ, సీపీఎస్ రద్దు, ఓపీఎస్ అమలు వంటి అంశాలు ఇప్పటికీ పరిష్కారం కాలేదన్నారు. కొత్త పాఠశాలల గురించి ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటున్నప్పటికీ, ఇప్పటికే ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు, ఉపాధ్యాయుల కొరత, హాస్టళ్లలో ఆహారం, తాగునీరు, వాష్‌రూమ్‌లు వంటి సమస్యలు తీవ్రంగా ఉన్నాయని పేర్కొన్నారు.

విద్యార్థుల స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు భారీగా పేరుకుపోయాయని, కాలేజీలకు నిధులు అందక విద్యార్థులు, యాజమాన్యాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని తెలిపారు. ముఖ్యమంత్రి ఇటీవల ఇంజినీరింగ్ విద్యార్థులపై చేసిన వ్యాఖ్యలు ఇంజినీరింగ్ వృత్తిని అవమానించేలా ఉన్నాయని ఆరోపించిన ఆయన, తెలంగాణలో వెంటనే జాతీయ నూతన విద్యా విధానం (ఎన్‌ఈపీ-2020) అమలు చేసి, విద్యాశాఖకు ప్రత్యేక మంత్రిని నియమించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *