రంగనాథ్‌ను త్వరగా బదిలీ చేయాలి.. హైకోర్టు కీలక ఆదేశాలు

రంగనాథ్‌ను త్వరగా బదిలీ
చేయాలి.. హైకోర్టు కీలక ఆదేశాలు

హైదరాబాద్, జూలై 31: హైడ్రా, శాంతా శ్రీరామ్ కన్‌స్ట్రక్షన్స్ కంపెనీ కోర్టు ధిక్కరణ కేసులో తెలంగాణ హైకోర్టు కీలక ఉత్తర్వులు వెలువరించింది. హైడ్రా కమిషనర్ రంగనాథ్ కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించినట్లు సుస్పష్టంగా ఉందని పేర్కొన్న ధర్మాసనం, వివాదాస్పద ఆస్తిలోకి యంత్రాలు, సిబ్బందితో ప్రవేశించడం చట్టవిరుద్ధమని స్పష్టం చేసింది. రంగనాథ్‌ను వీలైనంత త్వరగా ఆ బాధ్యతల నుంచి బదిలీ చేసి, ఆయన స్థానంలో మరో అధికారిని నియమించాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి (సీఎస్)కు సూచించింది.

తీర్పు సందర్భంగా న్యాయమూర్తి జస్టిస్ జూకంటి అనిల్ కుమార్ సుప్రీంకోర్టు గతంలో టాటా మోహన్‌రావు కేసులో ఇచ్చిన తీర్పును ప్రస్తావించారు. “శిక్షించడం కంటే క్షమించడంలోనే ఔన్నత్యం ఉంది” అనే సుప్రీంకోర్టు వ్యాఖ్యలను గుర్తుచేస్తూ, సంబంధిత అధికారికి జైలు శిక్ష విధిస్తే ఉద్యోగం కోల్పోయే అవకాశం ఉండటంతో పాటు అతనిపై ఆధారపడి ఉన్న కుటుంబం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి వస్తుందని భావించి క్షమాగుణం ప్రదర్శించిందని వివరించారు. అదే స్ఫూర్తితో ఈ కేసులో కూడా శిక్ష విధించకుండా హెచ్చరికతో సరిపెట్టినట్లు పేర్కొన్నారు.

ఒకే భూవివాదానికి సంబంధించి మూడు కోర్టు ధిక్కరణ పిటిషన్లు దాఖలవడం కోర్టు చరిత్రలోనే అరుదైన విషయమని హైకోర్టు వ్యాఖ్యానించింది. అంతేకాకుండా హైడ్రాపై ఇప్పటికే 60కి పైగా కోర్టు ధిక్కరణ పిటిషన్లు ఉన్న విషయాన్ని కూడా ధర్మాసనం ప్రస్తావించింది. వివాదాస్పద భూమిలో యంత్రాలు, సిబ్బందితో ప్రవేశించడం పూర్తిగా చట్టవిరుద్ధమని స్పష్టం చేసింది.

చట్టపాలన మాత్రమే కొనసాగాలని, వ్యక్తుల పాలనకు తావు ఉండకూడదని హైకోర్టు పేర్కొంది. వ్యక్తి ఆధిపత్యం కొనసాగితే అది ప్రజాస్వామ్యానికే మరణశాసనం అవుతుందని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఈ కోర్టు ధిక్కరణ కేసు వ్యక్తిగత ఆధిపత్యానికి నిదర్శనంగా నిలిచిందని పేర్కొంటూ, సంబంధిత అధికారిని తప్పించి మరో అధికారిని నియమించాలని సీఎస్‌కు సూచించింది. అనంతరం రంగనాథ్‌పై దాఖలైన కోర్టు ధిక్కరణ కేసు విచారణను ముగించింది.

ఈ కేసు లోతుకుంట సర్వే నెంబర్లు 1, 2లోని 40 ఎకరాల భూమికి సంబంధించినది. ఆ భూమి తమ స్వాధీనంలోనే ఉందని, హైకోర్టు ఉత్తర్వులు ఉన్నప్పటికీ హైడ్రా అధికారులు ఫెన్సింగ్ ఏర్పాటు చేసి కోర్టు ఆదేశాలను ఉల్లంఘించారని ఆరోపిస్తూ శాంతా శ్రీరామ్ కన్‌స్ట్రక్షన్స్ కంపెనీ కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు హైడ్రా కమిషనర్ రంగనాథ్ వ్యవహారంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ కీలక ఆదేశాలు జారీ చేసింది.

మరోవైపు సోషల్ మీడియాలో తనపై ఉద్దేశపూర్వకంగా తప్పుడు ప్రచారం జరుగుతోందని రంగనాథ్ స్పందించారు. తనపై అవాస్తవాలు ప్రచారం చేస్తున్న ఎక్స్ (X) ఖాతాను గుర్తించామని, కొన్ని వర్గాలు కావాలనే దుష్ప్రచారం చేస్తున్నాయని ఆరోపించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *