కోపరేటివ్ సెంట్రల్ బ్యాంకు ఉద్యోగులకు పెన్షన్ మంజూరు చేయాలి

- సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, సీఎస్ సంజయ్ జాజుకు మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ విజ్ఞప్తి
హైదరాబాద్, ఆగస్టు 1: తెలంగాణ రాష్ట్రంలోని ఉమ్మడి తొమ్మిది జిల్లాల జిల్లా కోపరేటివ్ సెంట్రల్ బ్యాంకుల్లో దాదాపు 40 సంవత్సరాల పాటు సేవలందించి పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు ప్రభుత్వం ప్రత్యేక పెన్షన్ పథకాన్ని అమలు చేయాలని తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల గెజిటెడ్, నాన్ గెజిటెడ్, ఉపాధ్యాయులు, పెన్షనర్లు మరియు కార్మికుల రాష్ట్ర జాయింట్ సెక్రటరీ మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.
40 ఏళ్ల సేవలకు గుర్తింపు ఇవ్వాలి
రైతులు, సహకార సంఘాలు, ప్రజలకు నాలుగు దశాబ్దాల పాటు విశేష సేవలు అందించిన కోపరేటివ్ సెంట్రల్ బ్యాంకు ఉద్యోగులు పదవీ విరమణ అనంతరం ఆర్థిక ఇబ్బందులతో జీవనం సాగిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వారి సేవలకు తగిన గుర్తింపుగా ప్రతి నెల పెన్షన్ అందించేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని కోరారు.
ఆర్థిక ఇబ్బందులతో రిటైర్డ్ ఉద్యోగులు
పెన్షన్ లేకపోవడంతో రిటైర్డ్ ఉద్యోగులు, వారి కుటుంబాలు తీవ్ర ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్నాయని ముజాహిద్ హుస్సేన్ తెలిపారు. ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు వైద్య ఖర్చులు భరించలేక అనేక మంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు.
ప్రభుత్వం ప్రత్యేక పథకం తీసుకురావాలి
ఉద్యోగుల సంక్షేమానికి కట్టుబడి ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కోపరేటివ్ సెంట్రల్ బ్యాంకు రిటైర్డ్ ఉద్యోగులను కూడా ఆదుకునేలా ప్రత్యేక పెన్షన్ పథకాన్ని ప్రవేశపెట్టాలని ఆయన విజ్ఞప్తి చేశారు. నెలకు కనీస ఆర్థిక సహాయం అందించినా వారి కుటుంబాలకు ఎంతో ఊరట కలుగుతుందని అన్నారు.
క్యాబినెట్లో నిర్ణయం తీసుకోవాలి
కోపరేటివ్ సెంట్రల్ బ్యాంకు రిటైర్డ్ ఉద్యోగులకు పెన్షన్ మంజూరుపై రాష్ట్ర క్యాబినెట్లో చర్చించి సానుకూల నిర్ణయం తీసుకోవాలని కోరారు. ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంటే వేలాది మంది రిటైర్డ్ ఉద్యోగులు జీవితాంతం ప్రభుత్వానికి రుణపడి ఉంటారని చెప్పారు.
ప్రభుత్వంపై ఆశలతో ఎదురు చూపులు
రిటైర్డ్ ఉద్యోగులు ప్రతిరోజూ ప్రభుత్వ నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నారని, వారి ఆశలను నిరాశ పరచకుండా సంక్షేమ పథకాల పరిధిలోకి తీసుకువచ్చి పెన్షన్ కల్పించాలని మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ విజ్ఞప్తి చేశారు.