రాహుల్ గాంధీకి కేటీఆర్ బహిరంగ లేఖ.. ఇంజనీర్లకు క్షమాపణ చెప్పాలని డిమాండ్

కాంగ్రెస్ పార్టీనే
క్రిమినల్ వేస్ట్

హైదరాబాద్, ఆగస్టు 2 (విశ్వం న్యూస్) : ఇంజనీరింగ్ విద్యార్థులు, ఇంజనీర్లు, అధ్యాపకులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీకి బహిరంగ లేఖ రాశారు. ఇంజనీర్లను “క్రిమినల్ వేస్ట్”గా అభివర్ణించడం యువత ఆత్మగౌరవాన్ని అవమానించడమేనని ఆయన పేర్కొన్నారు.

భారతీయ ఇంజనీర్లు ప్రపంచ స్థాయి కంపెనీలకు నాయకత్వం వహిస్తూ, అంతరిక్ష రంగంలో దేశ ప్రతిష్ఠను పెంచుతున్న సమయంలో అలాంటి వారిని అవమానించేలా వ్యాఖ్యలు చేయడం అత్యంత బాధాకరమని కేటీఆర్ అన్నారు. దేశ ప్రగతికి కృషి చేస్తున్న లక్షలాది ఇంజనీర్లను “క్రిమినల్ వేస్ట్”గా పిలవడం కాంగ్రెస్ పార్టీ వైఖరేనా అని రాహుల్ గాంధీ స్పష్టం చేయాలని ప్రశ్నించారు.

రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై స్పందించాల్సిన నైతిక, రాజకీయ బాధ్యత రాహుల్ గాంధీపైనే ఉందని, ఆయన మౌనంగా ఉండటం అంటే ఆ వ్యాఖ్యలను సమర్థించినట్లేనని కేటీఆర్ పేర్కొన్నారు. ప్రజాస్వామ్యం, రాజ్యాంగం, యువత గౌరవం గురించి మాట్లాడే ముందు కాంగ్రెస్ తన ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలపై వైఖరి వెల్లడించాలని డిమాండ్ చేశారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే విద్యార్థులు, ఇంజనీర్లు, అధ్యాపకులకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని, అలాగే కాంగ్రెస్ పార్టీ తరఫున రాహుల్ గాంధీ కూడా యువతకు క్షమాపణ చెప్పాలని కేటీఆర్ కోరారు. తమ పార్టీ ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలకు సంబంధం లేదని రాహుల్ గాంధీ చెప్పలేరని ఆయన అన్నారు.

గతంలో యూనివర్సిటీ విద్యార్థులను “బీరు–బిర్యానీ బ్యాచ్”గా అభివర్ణించిన రేవంత్ రెడ్డి, ఇప్పుడు ఇంజనీరింగ్ విద్యార్థులు, ఇంజనీర్లు, టీచర్లను కూడా అవమానిస్తున్నారని కేటీఆర్ విమర్శించారు. ప్రశ్నించిన వారిని దూషించడం రేవంత్‌కు అలవాటుగా మారిందని ఆరోపించారు.

తెలంగాణ యువత ఆత్మగౌరవం, ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసేలా ముఖ్యమంత్రి వ్యవహరిస్తున్నారని కేటీఆర్ అన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో యువత కాంగ్రెస్‌ను ఎలా ఎదుర్కొందో రాహుల్ గాంధీ గుర్తుంచుకోవాలని, యువశక్తిని తక్కువ అంచనా వేయవద్దని హెచ్చరించారు.

ఇప్పటికే కాంగ్రెస్ హామీలతో మోసపోయిన యువత ఈ వ్యాఖ్యలను కూడా గుర్తుంచుకుంటుందని, సరైన సమయంలో ప్రజాస్వామ్యబద్ధంగా తగిన సమాధానం ఇస్తుందని కేటీఆర్ పేర్కొన్నారు. “ఇంజనీర్లు, గురువులు క్రిమినల్ వేస్ట్ కాదు… యువతను మోసం చేసిన కాంగ్రెస్ే అసలు సిసలైన క్రిమినల్ వేస్ట్” అంటూ తన లేఖను ముగించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *