837 మంది హెల్త్ అసిస్టెంట్లకు ఎప్పుడొస్తుంది న్యాయం?

- దేవుడు వరమిచ్చినా… పూజారి వరం ఇవ్వట్లేదు..!
హైదరాబాద్, ఆగస్టు 4 (విశ్వం న్యూస్) : రాష్ట్ర ప్రజారోగ్య విభాగంలో డైరెక్టరేట్ ఆఫ్ హెల్త్ పరిధిలో పనిచేస్తున్న 837 మంది హెల్త్ అసిస్టెంట్లు సర్వీస్ రెగ్యులరైజేషన్, ప్రొబేషన్ డిక్లరేషన్ కోసం ఏళ్లుగా ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వం 2023లో కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తూ ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ, సంబంధిత శాఖలోని కొందరు అధికారుల నిర్లక్ష్య వైఖరి కారణంగా ఇప్పటికీ పూర్తి స్థాయిలో అమలు జరగడం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసి మూడు సంవత్సరాలు పూర్తయినా రెండో ఇంక్రిమెంట్ కూడా అందలేదని హెల్త్ అసిస్టెంట్లు వాపోతున్నారు. క్రమబద్ధీకరణ జరిగినప్పటికీ, సంబంధిత శాఖ నుంచి తుది ఉత్తర్వులు వెలువడకపోవడంతో సర్వీస్ రెగ్యులరైజేషన్, ప్రొబేషన్ డిక్లరేషన్, ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు అన్నీ నిలిచిపోయాయని వారు చెబుతున్నారు.
837 మంది హెల్త్ అసిస్టెంట్లలో కొంతమంది అభ్యర్థుల ధ్రువపత్రాలకు సంబంధించి న్యాయపరమైన అంశాలు ఉన్నాయని చెబుతూ మొత్తం జాబితాను పెండింగ్‌లో ఉంచడం సరికాదని ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. కొద్దిమంది సమస్యల కారణంగా అర్హులైన వందలాది మంది ఉద్యోగులకు న్యాయం జరగకుండా చేయడం ఎంతవరకు సమంజసమని వారు నిలదీస్తున్నారు. న్యాయపరమైన చిక్కులు ఉన్న వారి వ్యవహారాన్ని విడిగా పరిశీలించి, మిగిలిన వారిని వెంటనే రెగ్యులర్ చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
రెగ్యులరైజేషన్ కోసం కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా అధికారులు క్లారిఫికేషన్ కోసం ఉన్నతాధికారులకు పంపించామని చెప్పడం తప్ప ఎలాంటి స్పష్టమైన చర్యలు తీసుకోవడం లేదని హెల్త్ అసిస్టెంట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో తమ చెప్పులు అరిగేలా కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా సమస్యకు పరిష్కారం కనిపించడం లేదని బాధితులు చెబుతున్నారు.
ప్రొబేషన్ డిక్లేర్ కాకపోవడంతో తమ సర్వీస్ రికార్డులు పూర్తి కావడం లేదని, ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు నిలిచిపోవడంతో ఆర్థికంగా, ఉద్యోగ పరంగా తీవ్ర నష్టాన్ని ఎదుర్కొంటున్నామని హెల్త్ అసిస్టెంట్లు పేర్కొంటున్నారు. ఇప్పటికే 58 సంవత్సరాల వయస్సు దాటిన పలువురు ఉద్యోగులు రిటైర్మెంట్‌కు చేరువలో ఉండటంతో వారికి మరింత అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో తెలంగాణ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ ఉద్యోగుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, చీఫ్ సెక్రటరీ సంజయ్ జూజూల, వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ డాక్టర్ క్రిస్టినా జే. చాంగ్‌లకు విజ్ఞప్తి చేస్తూ, అర్హులైన 837 మంది హెల్త్ అసిస్టెంట్ల ప్రొబేషన్‌ను వెంటనే డిక్లేర్ చేసి, సర్వీస్ రెగ్యులరైజేషన్ పూర్తి చేయాలని కోరారు.
ప్రభుత్వం మానవతా దృక్పథంతో స్పందించి, ఎన్నో సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న హెల్త్ అసిస్టెంట్లకు న్యాయం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.