దానం నాగేందర్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించడంపై దాసోజు శ్రవణ్‌ విమర్శలు

దానం నాగేందర్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించడంపై దాసోజు శ్రవణ్‌ విమర్శలు

విశ్వం న్యూస్/ హైదరాబాద్, సెప్టెంబర్ 20 : ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ అనర్హత వ్యవహారంలో సుప్రీంకోర్టును ఆశ్రయించడంపై కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని ఉద్దేశించి బీఆర్‌ఎస్‌ నేత దాసోజు శ్రవణ్‌ తీవ్ర విమర్శలు చేశారు. ఉపఎన్నికలను ఎదుర్కొనే ధైర్యం లేకే దానం నాగేందర్‌ను సుప్రీంకోర్టు మెట్లెక్కిస్తున్నారని ఆయన ఆరోపించారు.

హైకోర్టు తీర్పు వెలువడిన వెంటనే దానం నాగేందర్‌ తాను సుప్రీంకోర్టుకు వెళ్లబోనని, రాజీనామా చేసి మళ్లీ ఖైరతాబాద్‌ బరిలో నిలిచి తన సత్తా చూపిస్తానని చెప్పారని దాసోజు శ్రవణ్‌ గుర్తుచేశారు. అయితే 24 గంటలు గడవకముందే సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేయడం వెనుక అసలు కారణమేంటని ప్రశ్నించారు.

ఇది దానం నాగేందర్‌ వ్యక్తిగత నిర్ణయం కాదని, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెరవెనుక ఉండి ఆడిస్తున్న రాజకీయ నాటకమని దాసోజు శ్రవణ్‌ ఆరోపించారు. ఖైరతాబాద్‌లో ఉపఎన్నిక జరిగితే కాంగ్రెస్‌ పరిస్థితి ఏంటో బయటపడుతుందనే భయంతోనే న్యాయపోరాటం పేరుతో కాలయాపన చేస్తున్నారని విమర్శించారు.

రేవంత్‌రెడ్డికి ప్రజాస్వామ్యంపై నిజమైన నమ్మకం ఉంటే న్యాయపరమైన అంశాల వెనుక దాక్కోకుండా ఉపఎన్నికను ఎదుర్కోవాలని దాసోజు శ్రవణ్‌ సవాల్‌ చేశారు. ఖైరతాబాద్‌ ప్రజల తీర్పును స్వీకరించేందుకు సిద్ధంగా ఉండాలని అన్నారు.

హైకోర్టు తీర్పు అనంతరం నిన్నటి వరకు ఒక రకంగా మాట్లాడి, ఇప్పుడు సుప్రీంకోర్టును ఆశ్రయించడం ప్రజలను అయోమయానికి గురిచేసే చర్యగా ఆయన అభివర్ణించారు. రాజ్యాంగ వ్యవస్థలను గౌరవిస్తూనే ప్రజల తీర్పును ఎదుర్కోవాలని సూచించారు.

ఖైరతాబాద్‌ ఉపఎన్నిక జరిగితే ప్రజలే తుది తీర్పు ఇస్తారని, కాంగ్రెస్‌ ప్రభుత్వానికి అక్కడ రాజకీయంగా గుణపాఠం చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని దాసోజు శ్రవణ్‌ పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *