రూ.1,300 కోట్ల దళితుల భూములపై రియల్ ఎస్టేట్ దందా:దాసోజు శ్రవణ్
ఏక్తా మాల్‌పై
బీఆర్ఎస్ ఫైర్

విశ్వo న్యూస్, హైదరాబాద్, ఆగస్టు 21 : పీఎం ఏక్తా మాల్ ప్రాజెక్టును కాంగ్రెస్ ప్రభుత్వం రియల్ ఎస్టేట్ ప్రయోజనాలకు మళ్లిస్తోందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ డాక్టర్ దాసోజు శ్రవణ్ ఆరోపించారు. తెలంగాణ భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కేంద్ర నిధులతో చేపట్టిన ఈ ప్రాజెక్టులో భారీగా అవకతవకలు జరుగుతున్నాయని విమర్శించారు.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 6 ఫ్లోర్లతో, 2.12 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో రూ.202 కోట్లతో ఏక్తా మాల్‌కు డీపీఆర్ రూపొందించారని శ్రవణ్ తెలిపారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ప్రాజెక్టును 43 ఫ్లోర్ల ట్విన్ టవర్లుగా మార్చి, నిర్మాణ విస్తీర్ణాన్ని 27 లక్షల చదరపు అడుగులకు పెంచిందని ఆరోపించారు.
అనుమతులు పూర్తికాకముందే తవ్వకాలు చేపట్టి, తొలుత రూ.7.78 కోట్లుగా ఉన్న ఎక్స్కవేషన్ కాంట్రాక్టును రూ.26.04 కోట్లకు పెంచారని ఆయన పేర్కొన్నారు. అలాగే లిప్కో ఆధ్వర్యంలోని 6 ఎకరాల 12 గుంటల భూమిని ఫ్రీహోల్డ్ పేరుతో ప్రైవేటు సంస్థలకు అప్పగించే ప్రయత్నం జరుగుతోందని, ఆ భూమి విలువ సుమారు రూ.1,300 కోట్లు ఉంటుందని ఆరోపించారు.
టెండర్ ప్రక్రియలోనూ మానిపులేషన్లు జరిగాయని శ్రవణ్ విమర్శించారు. వంశీరామ్, అపర్ణ బిల్డర్స్ కన్సార్టియానికి ప్రయోజనం చేకూరేలా నిబంధనలు రూపొందించారని ఆరోపించారు. టెండర్లు పూర్తికాకముందే జీహెచ్ఎంసీకి రూ.60 కోట్ల పర్మిషన్ ఫీజు చెల్లించడంపై కూడా ఆయన ప్రశ్నలు లేవనెత్తారు.
ఈ వ్యవహారంపై కేటీఆర్ కేంద్రానికి లేఖ రాయగా, డీపీఆర్, ప్రాజెక్టు వ్యయం, నిధుల వినియోగంపై సమగ్ర నివేదిక కోరుతూ కేంద్ర పరిశ్రమల శాఖ రాష్ట్రాన్ని ప్రశ్నించిందని శ్రవణ్ తెలిపారు. ప్రాజెక్టు టెండర్లను రద్దు చేసి సీబీఐ, సీఏజీ, లోక్‌పాల్‌తో సమగ్ర విచారణ జరిపించాలని బీఆర్ఎస్ డిమాండ్ చేసింది. అసెంబ్లీ, మండలి వేదికగా ఈ అంశంపై బహిరంగ చర్చకు ప్రభుత్వం సిద్ధం కావాలని శ్రవణ్ సవాల్ విసిరారు.