ఇందిరమ్మ లబ్ధిదారులకు గుడ్‌న్యూస్

ఇందిరమ్మ లబ్ధిదారులకు గుడ్‌న్యూస్

చివరి విడత డబ్బుల చెల్లింపులకు లైన్ క్లియర్

విశ్వo న్యూస్‌, హైదరాబాద్‌, ఆగస్టు 21: ఇందిరమ్మ ఇళ్ల పథకం లబ్ధిదారులకు ప్రభుత్వం శుభవార్త చెప్పనుంది. ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేసుకున్న లబ్ధిదారులకు చెల్లించాల్సిన చివరి విడత నిధులను ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా విడుదల చేసేందుకు గృహ నిర్మాణ సంస్థ ఏర్పాట్లు చేస్తోంది. ప్రభుత్వ ఆమోదం లభించిన వెంటనే లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు జమ చేయాలని అధికారులు నిర్ణయించినట్లు తెలుస్తోంది.

ఇందిరమ్మ ఇళ్ల పథకం మొదటి దశలో రాష్ట్రవ్యాప్తంగా గ్రేటర్ హైదరాబాద్ మినహా 3.68 లక్షల ఇళ్లను కేటాయించారు. ఇందులో 3.22 లక్షల ఇళ్లు లబ్ధిదారులకు మంజూరు కాగా.. సుమారు 1.60 లక్షల మంది ఇప్పటికే గృహ ప్రవేశం చేశారు. మిగిలిన ఇళ్ల నిర్మాణం తుది దశలో ఉంది.

ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం ఒక్కో లబ్ధిదారునికి మొత్తం రూ.5 లక్షలను నాలుగు విడతల్లో చెల్లిస్తోంది. అయితే మొదటి దశలో ఇళ్లను పూర్తి చేసుకున్న కొంతమంది లబ్ధిదారులకు చివరి విడతగా అందాల్సిన రూ.లక్ష చెల్లింపు పెండింగ్‌లో ఉంది. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన–గ్రామీణ్ (PMAY-G) కింద కేంద్రం నుంచి రాష్ట్రానికి ఒక్కో ఇంటికి రూ.72 వేల నిధులు రావాల్సి ఉండటంతో చివరి విడత చెల్లింపులు నిలిచిపోయాయి.

కేంద్రం నుంచి నిధుల కేటాయింపు, విడుదలపై ఇంకా స్పష్టత రాకపోవడంతో లబ్ధిదారులకు ఇబ్బంది కలగకుండా ప్రత్యామ్నాయ మార్గాల్లో నిధులు సమకూర్చాలని గృహ నిర్మాణ సంస్థ యోచిస్తోంది. చివరి విడత చెల్లింపుల కోసం సుమారు రూ.1,000 కోట్లు అవసరం కాగా.. ఒక్కో విడతకు రూ.300 కోట్ల చొప్పున మూడు విడతల్లో నిధులు విడుదల చేసే అవకాశం ఉంది.

ప్రభుత్వ అనుమతి వచ్చిన వెంటనే ఇంటి నిర్మాణాన్ని నిర్ణీత గడువులో పూర్తి చేసుకున్న లబ్ధిదారుల ఖాతాల్లో చివరి విడత సొమ్మును జమ చేసే ప్రక్రియ ప్రారంభం కానుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *