ఉద్యోగుల బదిలీలు చేపట్టండి
వాణిజ్య పన్నుల శాఖలో ప్రమోషన్లు, మౌలిక సదుపాయాలు కల్పించాలి: ముజాహిద్ హుస్సేన్

విశ్వం న్యూస్/హైదరాబాద్, సెప్టెంబర్ 9: వాణిజ్య పన్నుల శాఖలో పనిచేస్తున్న ఉద్యోగుల బదిలీలను వెంటనే చేపట్టాలని తెలంగాణ కమర్షియల్ టాక్సెస్ సర్వీసెస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు మహ్మద్ ముజాహిద్ హుస్సేన్ కోరారు. ఈ మేరకు బుధవారం హైదరాబాద్లోని వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ, ఎక్సైజ్ శాఖ రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ, కమిషనర్ ఎం. రఘునందన్ రావును కలిసి అసోసియేషన్ ప్రతినిధులతో వినతిపత్రం సమర్పించారు.
శాఖలోని అన్ని క్యాడర్లకు డిపార్ట్మెంటల్ ప్రమోషన్ కమిటీ (డీపీసీ) ఏర్పాటు చేసి త్వరగా పదోన్నతులు కల్పించాలని కోరారు. అలాగే జాయింట్ కమిషనర్, సీటీవో కార్యాలయాల్లో కొత్త కంప్యూటర్లు, ఫర్నిచర్, ప్రింటర్లు, స్టేషనరీతో పాటు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలని విజ్ఞప్తి చేశారు.
కొన్ని సంవత్సరాలుగా బదిలీలు లేక సీనియర్ అసిస్టెంట్లు, ఏసీటీవోలు, డీసీటీవోలు, సీటీవోలు మానసిక ఆందోళనకు గురవుతున్నారని ముజాహిద్ హుస్సేన్ తెలిపారు. ఉద్యోగుల సమస్యలను దృష్టిలో పెట్టుకుని వెంటనే బదిలీల ప్రక్రియ చేపట్టాలని కోరారు.
ఈ సందర్భంగా రఘునందన్ రావు స్పందిస్తూ త్వరలోనే ఉద్యోగుల బదిలీలు చేపడతామని, ప్రమోషన్ల కోసం డీపీసీ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలోని వాణిజ్య పన్నుల శాఖ కార్యాలయాలకు అవసరమైన ఫర్నిచర్, కంప్యూటర్లు, స్టేషనరీ తదితర సామగ్రి సమకూర్చేందుకు ఇప్పటికే టెండర్లు పిలిచినట్లు తెలిపారు.
ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి చొరవ చూపుతున్న రఘునందన్ రావుకు ముజాహిద్ హుస్సేన్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వ చర్యలపై రాష్ట్రంలోని వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగులు సంతోషంగా ఉన్నారని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో జి. ప్రభాకర్, పి. ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.