జీవో 97 రద్దు చేయాలి : దాసోజు శ్రవణ్
జీవో 97 రద్దు చేయాలి : దాసోజు శ్రవణ్

విశ్వం న్యూస్/హైదరాబాద్, సెప్టెంబర్ 11: పాలిటెక్నిక్ కళాశాలలను యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీలో విలీనం చేస్తూ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 97ను తక్షణమే రద్దు చేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ డాక్టర్ దాసోజు శ్రవణ్ కుమార్ డిమాండ్ చేశారు. తెలంగాణ శాసనమండలిలో ప్రత్యేక ప్రస్తావన ద్వారా పాలిటెక్నిక్ విద్యార్థుల సమస్యలను ఆయన ప్రస్తావించారు. ఈ సందర్భంగా జీవో 97 ప్రతులను సభలోనే చించివేసి నిరసన తెలిపారు.
రాష్ట్రంలోని దాదాపు లక్ష మంది పేద, మధ్యతరగతి, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థుల భవిష్యత్తుతో ప్రభుత్వం చెలగాటమాడొద్దని ఆయన అన్నారు. దశాబ్దాలుగా కొనసాగుతున్న బహుళ అంచెల సాంకేతిక విద్యా వ్యవస్థను ఎలాంటి చర్చ లేకుండా మార్చడం సరికాదన్నారు.
పాలిటెక్నిక్ విద్యార్థులు శాంతియుతంగా నిరసన తెలుపుతుంటే పోలీసులు లాఠీఛార్జీలు, నిర్బంధాలకు పాల్పడటం దుర్మార్గమని శ్రవణ్ విమర్శించారు. 1923లో మాసబ్ ట్యాంక్ పాలిటెక్నిక్ ప్రారంభమైందని, 1957లో స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఏర్పడిందని గుర్తుచేశారు.
మౌలిక సదుపాయాలు, అర్హులైన అధ్యాపకుల విషయంలో స్పష్టత లేని స్కిల్ యూనివర్సిటీలో పాలిటెక్నిక్ కళాశాలలను విలీనం చేయడం వల్ల విద్యార్థుల భవిష్యత్తు దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల విలువైన భూములను ప్రైవేటు సంస్థలకు అప్పగించే ప్రయత్నాలను సహించేది లేదన్నారు.
జీవో 97ను రద్దు చేసి పాలిటెక్నిక్ విద్యా వ్యవస్థ స్వయంప్రతిపత్తిని కాపాడాలని డిమాండ్ చేస్తూ, లేనిపక్షంలో విద్యార్థులు, తల్లిదండ్రుల పక్షాన ప్రజా పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని దాసోజు శ్రవణ్ హెచ్చరించారు.