మక్తల్ సివిల్ ఆస్పత్రిలో సేవా కార్యక్రమం
మక్తల్ సివిల్ ఆస్పత్రిలో సేవా కార్యక్రమం

మక్తల్: సోషల్ జస్టిస్ ఫర్ వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆధ్వర్యంలో మక్తల్ సివిల్ హాస్పిటల్‌లో సేవా కార్యక్రమం నిర్వహించారు. సంస్థ వ్యవస్థాపకులు, నేషనల్ చైర్మన్, హైకోర్టు న్యాయవాది డా. కొప్పుల విజయ్ కుమార్, తెలంగాణ రాష్ట్ర ఇన్‌చార్జి ఎం.డి. సాదిక్ అలీ ఆదేశాల మేరకు మక్తల్ మండల చైర్మన్ ఎ. భగవాన్ ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది.
ఈ సందర్భంగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులు, వారి సహాయకులు, ఆసుపత్రి సిబ్బంది, ప్రజలు కలిపి సుమారు 200 మందికి పండ్లు, బ్రెడ్, బిస్కెట్లు, అల్పాహారం, పులిహోర పంపిణీ చేశారు.

ఏఎస్‌ఐ సురేష్ కుమార్‌కు సన్మానం
కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మక్తల్ టౌన్ ఏఎస్‌ఐ బి. సురేష్ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ఇన్‌చార్జి ఎం.డి. సాదిక్ అలీ ఆయనను శాలువాతో సన్మానించి గౌరవించారు.
సేవే సంస్థ ప్రధాన లక్ష్యం
ఈ సందర్భంగా సాదిక్ అలీ మాట్లాడుతూ.. మానవత్వంతో సేవ చేయడం, బాధితులకు అండగా నిలవడం, అవసరంలో ఉన్నవారికి చేతనైన సహాయం అందించడం తమ సంస్థ ప్రధాన లక్ష్యమని తెలిపారు. మానవ హక్కుల పరిరక్షణతో పాటు ప్రజల్లో చట్టాలు, హక్కులపై అవగాహన కల్పిస్తూ సామాజిక సేవా కార్యక్రమాలను నిరంతరం నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ఆసుపత్రుల్లో ఉన్న రోగులు, వారి కుటుంబ సభ్యులకు అందించే చిన్న సహాయం కూడా వారికి ధైర్యం, భరోసా కల్పిస్తుందని అన్నారు.
పలువురి సహకారం
కార్యక్రమంలో మహబూబ్‌నగర్ టౌన్ చైర్మన్ ఎం. లక్ష్మీకాంత్, వైస్ చైర్మన్ వి. గిరిప్రసాద్, ఉట్కూరు టౌన్ చైర్మన్ శివ ప్రసాద్ తదితరులు పాల్గొని సేవా కార్యక్రమానికి సహకరించారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసిన సంస్థ సభ్యులు, ఆసుపత్రి సిబ్బంది, పోలీసు అధికారులు, సహకరించిన ప్రతి ఒక్కరికీ నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు.