హైదరాబాద్‌లో రౌడీషీటర్ దారుణ హత్య (లైవ్ మర్డర్ వీడియో..! )
హైదరాబాద్‌లో రౌడీషీటర్ దారుణ హత్య (లైవ్ మర్డర్ వీడియో..! )

- పాత కక్షలతో ప్రాణ స్నేహితుడినే హతమార్చిన మహేష్
నిందితుల కోసం ప్రత్యేక బృందాలతో పోలీసుల గాలింపు
విశ్వం న్యూస్/హైదరాబాద్, సెప్టెంబర్ 15: హైదరాబాద్‌లోని నాగోల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో రౌడీషీటర్ దారుణ హత్యకు గురయ్యాడు. బండ్లగూడ ఆనంద్‌నగర్ చౌరస్తా సమీపంలో జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర భయాందోళనకు దారితీసింది. హత్యకు సంబంధించిన దృశ్యాలు వీడియోలో నమోదైనట్లు సమాచారం.
స్నేహితుడే హంతకుడిగా..
ఖమ్మం జిల్లా ఇల్లెందుకు చెందిన రౌడీషీటర్ మహమ్మద్ నహీమ్‌ను అతడి చిన్ననాటి స్నేహితుడైన ఉమామహేశ్వర్ అలియాస్ జేకే మహేష్ దారుణంగా హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇద్దరూ చిన్ననాటి నుంచి కలిసి చదువుకున్న ఆప్తమిత్రులుగా తెలుస్తోంది.
సెటిల్మెంట్ డబ్బులే కారణమా?
బండ్లగూడ సహభావన అపార్ట్‌మెంట్‌లో మహమ్మద్ నహీమ్ నివాసముంటున్నాడు. సెటిల్మెంట్ల ద్వారా వచ్చిన డబ్బుల విషయంలో గత మూడు నెలలుగా నహీమ్, మహేష్ మధ్య వివాదం కొనసాగుతున్నట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైనట్లు సమాచారం. ఈ పాత కక్షలే హత్యకు కారణమై ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు.
ఇద్దరిపై రౌడీషీట్లు
మహేష్, నహీమ్ ఇద్దరిపైనా ఇప్పటికే పలు హత్య కేసులు ఉన్నట్లు తెలుస్తోంది. ఇల్లెందు పోలీస్‌స్టేషన్‌లో ఇద్దరిపై రౌడీషీట్లు కూడా ఉన్నట్లు సమాచారం.
నిందితుల కోసం గాలింపు
హత్య అనంతరం మహేష్‌తో పాటు అతడి బృందం పరారైనట్లు తెలుస్తోంది. నిందితులను పట్టుకునేందుకు నాగోల్ పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో వెలుగులోకి రావాల్సి ఉంది.