సీటు కోసం కొట్లాట.. ఫ్రీ బస్సులో మహిళల రచ్చ వైరల్! (వీడియో)
సీటు కోసం కొట్లాట..
ఫ్రీ బస్సులో మహిళల
రచ్చ వైరల్! (వీడియో)

విశ్వం న్యూస్/హైదరాబాద్, సెప్టెంబర్ 14: పరిగి నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఆర్టీసీ బస్సులో సీటు కోసం ఇద్దరు మహిళల మధ్య మొదలైన వాగ్వాదం తీవ్ర ఘర్షణకు దారితీసింది. మాటామాటా పెరగడంతో మహిళలు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ ఘటనతో బస్సులో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
సీటు విషయంలో మొదట ఓ మహిళ మరో మహిళపై దాడి చేసినట్లు తెలుస్తోంది. దీంతో ఆమెకు మద్దతుగా మరో ముగ్గురు మహిళలు రంగంలోకి దిగి దాడి చేసినట్లు సమాచారం. నలుగురు మహిళల మధ్య గొడవ తీవ్రరూపం దాల్చడంతో తోటి ప్రయాణికులు వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. అయినప్పటికీ వారు వెంటనే శాంతించకపోవడంతో పరిస్థితి అదుపుతప్పింది.
దీంతో డ్రైవర్ బస్సును కొద్దిసేపు నిలిపివేసి, ప్రయాణికుల సహాయంతో మహిళలను శాంతింపజేశారు. అనంతరం బస్సు తిరిగి హైదరాబాద్ వైపు బయలుదేరింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
పెరిగిన రద్దీతో సీట్ల కోసం పోటీ : ఉచిత బస్సు పథకం అమల్లోకి వచ్చిన తర్వాత ఆర్టీసీ బస్సుల్లో మహిళల ప్రయాణం గణనీయంగా పెరిగింది. దీంతో ముఖ్యంగా రద్దీ సమయాల్లో బస్సుల్లో సీట్ల కోసం పోటీ పెరుగుతోంది. సీట్ల కొరత, రద్దీ కారణంగా ప్రయాణికుల మధ్య చిన్నపాటి వివాదాలు ఘర్షణలకు దారితీస్తున్న ఘటనలు కూడా వెలుగులోకి వస్తున్నాయి.
ప్రయాణికుల్లో ఆందోళన : బస్సుల్లో రద్దీ పెరుగుతున్న నేపథ్యంలో ప్రయాణికుల భద్రత, క్రమశిక్షణపై ఆర్టీసీ అధికారులు మరింత దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సీటు కోసం మొదలైన చిన్న వివాదం చివరకు పరస్పర దాడులకు దారితీయడం ప్రయాణికులను ఆందోళనకు గురిచేసింది.