రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలి: దాసోజు శ్రవణ్

రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలి: దాసోజు శ్రవణ్

విద్యుత్ సంక్షోభం, బొగ్గు కుంభకోణంపై రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలి: దాసోజు శ్రవణ్

విశ్వం న్యూస్/ హైదరాబాద్/అక్టోబర్ 11 : గోదావరిఖనిలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బహిరంగ సభను విజయవంతం చేసిన సింగరేణి కార్మికులకు, ప్రజలకు బీఆర్ఎస్ పార్టీ తరఫున ఎమ్మెల్సీ డా. దాసోజు శ్రవణ్ కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల వల్ల విద్యుత్ రంగం సంక్షోభంలోకి వెళ్లిందని, సింగరేణిలో భారీ స్థాయిలో బొగ్గు అక్రమాలు జరిగాయని ఆయన ఆరోపించారు.

గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేసీఆర్ నాయకత్వంలో విద్యుత్ ఉత్పత్తి 7,000 మెగావాట్ల నుంచి 20,000 మెగావాట్లకు పెరిగిందని శ్రవణ్ పేర్కొన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో విద్యుత్ కోతలు లేవని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ, పలు ప్రాంతాల్లో రైతులు సబ్‌స్టేషన్ల వద్ద ఆందోళనలు చేస్తున్నారని, పరిశ్రమలు జనరేటర్లపై ఆధారపడాల్సిన పరిస్థితులు ఉన్నాయని విమర్శించారు.

యాదాద్రి, జైనూర్ విద్యుత్ ప్లాంట్ల సామర్థ్యంపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. అధికారులను సస్పెండ్ చేస్తామంటూ హెచ్చరించడం ద్వారా ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చలేరన్నారు.

సింగరేణిలో సుమారు 40 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు, రూ.1,600 కోట్ల విలువైన సంపద మాయమైనట్లు ఆరోపణలు ఉన్నాయని పేర్కొంటూ, ఈ వ్యవహారంపై సీబీఐ లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. సింగరేణిని ప్రైవేటీకరించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని ఆరోపించారు.

కాళేశ్వరం ప్రాజెక్టుపై రాజకీయ కక్షతో వ్యవహరిస్తూ ఉత్తర తెలంగాణ రైతులకు నష్టం కలిగిస్తున్నారని కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. విద్యుత్ రంగంలో సంక్షోభం, సింగరేణి బొగ్గు వ్యవహారాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నైతిక బాధ్యత వహించి వెంటనే రాజీనామా చేయాలని ఎమ్మెల్సీ డా. దాసోజు శ్రవణ్ డిమాండ్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *