Today TrendingVishwam News

ఇంటర్ బోర్డు రద్దు నిర్ణయాన్ని నిలిపివేయాలి: దాసోజు శ్రవణ్


హైదరాబాద్, నవంబర్ 22: తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు రద్దు నిర్ణయాన్ని తక్షణమే నిలిపివేసి, విద్యావేత్తలు, విద్యార్థి సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు, రాజకీయ పార్టీలతో అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ డాక్టర్ దాసోజు శ్రవణ్ కుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇంటర్మీడియట్ విద్యా వ్యవస్థను రద్దు చేసి 9 నుంచి 12వ తరగతి వరకు ఒకే విద్యా విధానాన్ని తీసుకొస్తే తెలంగాణ విద్యార్థుల స్థానికత (డొమిసైల్) హక్కులకు తీవ్ర విఘాతం కలుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆదివారం తెలంగాణ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం విద్యా వ్యవస్థపై ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటోందని విమర్శించారు.

కొఠారి కమిషన్ సిఫార్సుల మేరకు నాటి విద్యాశాఖ మంత్రి పీవీ నరసింహారావు విస్తృత సంప్రదింపుల అనంతరం ఇంటర్మీడియట్ వ్యవస్థను ప్రవేశపెట్టారని, అనంతరం ఎన్టీఆర్ వృత్తి విద్యా కోర్సులతో దానిని మరింత బలోపేతం చేశారని గుర్తుచేశారు. ఐదు దశాబ్దాల చరిత్ర కలిగిన వ్యవస్థను ఎలాంటి సమగ్ర అధ్యయనం, ప్రజాస్వామిక చర్చ లేకుండా రద్దు చేయాలని చూడటం సరైంది కాదన్నారు.

ఇంటర్మీడియట్ బోర్డు రద్దుతో 9 నుంచి 12వ తరగతి వరకు ఒకే గొడుగు కిందకు తీసుకొస్తే ఇతర రాష్ట్రాల విద్యార్థులు నాలుగేళ్లపాటు తెలంగాణలో చదివి స్థానిక హోదా పొందే అవకాశం ఏర్పడుతుందని, తద్వారా తెలంగాణ విద్యార్థుల మెడికల్, ఇంజనీరింగ్ స్థానిక కోటాపై ప్రభావం పడుతుందని హెచ్చరించారు. ఆకునూరి మురళి విద్యా కమిషన్ నివేదికను అసెంబ్లీ, శాసనమండలిలో ఎందుకు ప్రవేశపెట్టడం లేదని ప్రశ్నించారు. విద్యా వ్యవస్థలో మార్పులపై ప్రొఫెసర్ కోదండరాం తన వైఖరిని వెల్లడించాలని కోరారు.

ముఖ్యమంత్రి చెబుతున్న డ్రాపౌట్ల గణాంకాలు వాస్తవాలకు భిన్నంగా ఉన్నాయని, యూడైస్‌ ప్లస్ నివేదిక ప్రకారం విద్యార్థుల విద్యాభ్యాస కొనసాగింపుపై సరైన వివరాలను పరిశీలించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఉత్తీర్ణత శాతం పెరగకపోవడానికి బోర్డు నిర్మాణం కారణం కాదని, నిధులు, అధ్యాపకుల కొరతే ప్రధాన సమస్యలని పేర్కొన్నారు.

గురుకుల పాఠశాలల్లో బంకర్ బెడ్ల కొనుగోళ్లలో రూ.100 కోట్ల అవినీతి జరిగిందని, ఆహార పదార్థాలు, యూనిఫారాల టెండర్లలో రూ.5 వేల కోట్ల వరకు అక్రమాలు చోటుచేసుకున్నాయని ఆరోపించారు. ఈ వ్యవహారాలపై సిట్టింగ్ హైకోర్టు న్యాయమూర్తితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. విద్యారంగానికి బడ్జెట్‌లో 15 శాతం నిధులు కేటాయించాలని, ఖాళీగా ఉన్న ఉపాధ్యాయులు, లెక్చరర్లు, ప్రొఫెసర్ల పోస్టులను భర్తీ చేయాలని, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే చెల్లించాలని కోరారు.

ఇంటర్ బోర్డు రద్దు నిర్ణయాన్ని నిలిపివేసి, ఆకునూరి మురళి కమిషన్ నివేదికను బహిర్గతం చేయాలని, స్థానికత హక్కులకు రక్షణ కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే విద్యార్థులు, అధ్యాపకులు, మేధావులతో కలిసి రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని దాసోజు శ్రవణ్ హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *