అమిత్ షా ముస్లిం రిజర్వేషన్లు
ఎత్తివేస్తామనడం చట్టవిరుద్ధం
- పార్కులు, ప్రభుత్వ స్థలాలు కబ్జా అవుతున్న చూసి చూడనట్లు ఉంటున్న అధికారులు..
- జంట కార్పొరేషన్లలో బీఆర్ఎస్ పార్టీ ఏజెంట్లుగా అధికారులు..
- సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు డిమాండ్
బోడుప్పల్, ఏప్రిల్ 24 (విశ్వం న్యూస్) : భారతదేశంలో ముస్లిం రిజర్వేషన్లు ఎత్తివేస్తామని కేంద్ర మంత్రి అమిత్ షా చెప్పడం చట్ట విరుద్ధమని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు విమర్శించారు.
మేడ్చల్ నియోజకవర్గం మేడిపల్లి మండలం బోడుప్పల్, పిర్జాదిగూడ కార్పొరేషన్ లలో మేడిపల్లి మండల కార్యదర్శి రచ్చ కిషన్ అధ్యక్షతన సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో బోడుప్పల్ కార్పొరేషన్ ఇంద్రానగర్ చౌరస్తాలో ఇంటింటికి సిపిఐ పాదయాత్రను సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ప్రారంభించారు.
ఈ సందర్భంగా కూనంనేని సాంబశివరావు ప్రసంగిస్తూ తెలంగాణలో బిజెపి అధికారంలోకి వస్తే ముస్లింల రిజర్వేషన్లు తీసివేస్తామని చెప్పడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. బిజెపి అధికారంలోకి రాగానే ధరలు పెంచి ప్రజలపై బారాలు మోపడం జరిగింది. నిరుద్యోగ సమస్య పరిష్కరించకపోగా పేదలపై పెట్రోల్, డీజిల్, గ్యాస్, నిత్య అవసర వస్తువుల ధరలు నిత్యం పెంచుకుంటూ వెళ్తున్నారని విమర్శించారు.
మేడిపల్లి మండలంలో అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతుందని విమర్శించారు. బోడుప్పల్ కార్పొరేషన్ సర్వే నెంబర్ 63/1లో ప్రభుత్వ భూమిని కబ్జాదారులు దేచ్ఛగా ఆక్రమిస్తున్న అధికారులు చూసి చూడనట్టు చూడడం చాలా సిగ్గుచేటు అని అన్నారు. బోడుప్పల్ పెద్దకంచలో 365 ఎకరాలలో లబ్ధిదారులకు ప్రభుత్వం ల్యాండ్ పూలింగ్ కింద లబ్ధిదారులకు ఎకరానికి 1000 గజాలు చొప్పున కేటాయించాలని డిమాండ్ చేశారు. అలాగే ఒక వక్స్ బోర్డ్ భూముల్లో లబ్ధిదారులను రెగ్యులరైజ్ చేయాలని, పీర్జాదిగూడ కార్పొరేషన్ పరిధిలో పార్కు, పార్కు స్థలాలను కబ్జా చేస్తున్న గానీ అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్న అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని, మున్సిపల్ అధికారులు బిఆర్ఎస్ పార్టీ ఏజెంట్లుగా మారి కార్మికులకు అన్యాయం చేస్తున్నారని విమర్శించారు.
రాష్ట్ర కార్యదర్శి ఎన్ బాల మల్లేష్, పి పద్మ మాట్లాడుతూ బిజెపి కో హటావో… దేశ్ కో బచావో అనే నినాదంతో రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ అంబేద్కర్ జయంతి 2023 ఏప్రిల్ 14 నుంచి మే 14 వరకు ఈ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా ప్రతి రాష్ట్రంలో, ప్రతి జిల్లాలో, ప్రతి మండలంలో, ప్రతి గ్రామంలో ప్రజల వద్దకు వెళ్లి ప్రధాని మోడీ నాయకత్వంలోని బిజెపి ప్రభుత్వ విధానాల వలన దేశంలో వివిధ రంగాలలో జరుగుతున్న అన్యాయాలను దేశ సమైక్యత సమగ్రతలకు వాటిల్లే ప్రమాదాలను ప్రజలకు వివరించడంతో పాటు ప్రమాదకర ఫాసిస్ట్ నిరంకుశ హిట్లర్ తరహా పాలనను అందిస్తున్న నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని 2024 ఎన్నికల్లో ఓడించి వామపక్ష ,ప్రగతిశీల లౌకిక, ప్రజాస్వామ్య శక్తులతో కూడిన ప్రభుత్వం అధికారంలోకి వచ్చే వరకు ప్రజలను చైతన్యం వచ్చే పాదయాత్రను ప్రజా పోరు యాత్రను వివిధ రూపాలలో చేపట్టి ప్రతి గడపగడపకు సందర్శించి ప్రజలకు తెలియజేస్తామని వివరించారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రజానాట్యమండలి మండలి ప్రధాన కార్యదర్శి పల్లె నరసింహ, దళిత హక్కుల రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనిల్ కుమార్, సోషల్ మీడియా రాష్ట్ర ఇంచార్జ్ శ్రీమాన్, జిల్లా కార్యదర్శి డి జి సాయిల్ గౌడ్, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పుట్ట లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.