దళిత, బీసీల భూములపై ప్రభుత్వ పెద్దల కన్ను!

దళిత, బీసీల భూములపై ప్రభుత్వ పెద్దల కన్ను!

దళిత, బీసీల భూములపై ప్రభుత్వ పెద్దల కన్ను!

  • వేల కోట్ల విలువైన భూముల అన్యాక్రాంతంపై విచారణ జరపాలి: ఎమ్మెల్సీ డా. దాసోజు శ్రవణ్

హైదరాబాద్: తెలంగాణలో దళిత, బీసీ వర్గాల అభ్యున్నతి కోసం కేటాయించిన ప్రభుత్వ భూములు ప్రైవేట్ సంస్థల చేతుల్లోకి వెళ్తున్నాయని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ డా. దాసోజు శ్రవణ్ ఆరోపించారు. రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారాన్ని అడ్డంపెట్టుకుని ప్రభుత్వ భూముల పరిరక్షణ బాధ్యతను విస్మరిస్తోందని విమర్శించారు. ప్రజల ఆస్తులను కాపాడాల్సిన ప్రభుత్వం తోటమాలిలా వ్యవహరించాల్సింది పోయి, భూముల అన్యాక్రాంతానికి కారణమవుతోందని మండిపడ్డారు.

బుధవారం హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గచ్చిబౌలి ప్రాంతంలోని TG LIPCO (లిడ్ క్యాప్)కు చెందిన ఆరు ఎకరాలకు పైగా భూమిని అపర్ణ, వంశీరామ్ బిల్డర్స్‌కు అప్పగించారని ఆరోపించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల కళా ఉత్పత్తుల ప్రదర్శన కోసం ఏక్తా మాల్ ఏర్పాటు చేస్తామని చెప్పి, చివరకు ఆ భూమిని రియల్ ఎస్టేట్ ప్రాజెక్టు వైపు మళ్లించారని విమర్శించారు.

అలాగే శేరిలింగంపల్లి మండలం ఖాజాగూడ గ్రామంలోని సర్వే నంబర్ 20/1లో ఉన్న 3 ఎకరాల 17 గుంటల ప్రభుత్వ భూమిని ఎస్‌ఏఎస్ ఇన్‌ఫ్రా సంస్థకు కట్టబెట్టినట్లు ఆరోపించారు. 2013లో అప్పటి ప్రభుత్వం బీసీ విద్యార్థుల విద్యాభివృద్ధి కోసం బీసీ స్టడీ సర్కిల్‌కు కేటాయించిన భూమిని ప్రైవేట్ సంస్థకు ఎలా అప్పగిస్తారని ప్రశ్నించారు. ఈ భూమి విలువ సుమారు రూ.1,000 కోట్లు ఉంటుందని పేర్కొన్నారు.

2020 జనవరి 13న రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఇచ్చిన లేఖలో సదరు సంస్థ భూమిని అనధికారికంగా ఆక్రమించినట్లు పేర్కొని, రూ.1.93 కోట్ల జరిమానా విధించడంతో పాటు భూమిని ఖాళీ చేయించాలని ఆదేశించినట్లు తెలిపారు. 2025 నవంబర్‌లో ఈ భూమిని 22-A నిషేధిత ఆస్తుల జాబితాలో చేర్చినప్పటికీ, అనంతరం రిజిస్ట్రేషన్లు ఎలా జరిగాయని ప్రశ్నించారు. రెవెన్యూ, రిజిస్ట్రేషన్ రికార్డుల్లో మార్పులు చేసిన అధికారులెవరో తేల్చాలని డిమాండ్ చేశారు.

ఖాజాగూడలోని తౌటానికుంట చెరువు భూముల ఆక్రమణపైనా శ్రవణ్ ఆందోళన వ్యక్తం చేశారు. సర్వే నంబర్ 17 పరిధిలోని 4 ఎకరాల 11 గుంటల చెరువు భూమి ఆక్రమణకు గురవుతోందని, హైడ్రా ఏర్పాటు చేసిన ఇనుప కంచెను ధ్వంసం చేసి, చెరువు భూమిలో మట్టి పోసి రోడ్లు నిర్మిస్తున్నారని ఆరోపించారు. చెరువు ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్ పరిధిలో భారీ నిర్మాణాలకు అనుమతులు ఎలా ఇచ్చారని ప్రశ్నించారు.

ఈ వ్యవహారంపై పలువురు ప్రజాప్రతినిధులు ప్రభుత్వానికి, సంబంధిత అధికారులకు ఫిర్యాదులు చేసినప్పటికీ చర్యలు తీసుకోకపోవడం ఏమిటని నిలదీశారు. సామాన్యుల ఇళ్లపై చర్యలు తీసుకునే అధికారులు, కోట్లాది రూపాయల విలువైన ప్రభుత్వ భూములు, చెరువుల ఆక్రమణల విషయంలో ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు.

ఖాజాగూడ ప్రభుత్వ భూములు, తౌటానికుంట చెరువు వ్యవహారంపై హైకోర్టు పర్యవేక్షణలో స్వతంత్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. బీసీ స్టడీ సర్కిల్ భూమికి సంబంధించిన ప్రైవేట్ సంస్థ అనుమతులను రద్దు చేసి, భూమిని తిరిగి ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకోవాలని కోరారు. దళిత, బీసీ విద్యార్థుల భవిష్యత్తు, ఆత్మగౌరవానికి సంబంధించిన భూములను పరిరక్షించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బీసీ మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖతో పాటు బీసీ అడ్వైజర్ వి. హనుమంతరావు ఈ అంశంపై స్పందించాలని అన్నారు.

ఈ మీడియా సమావేశంలో బీఆర్ఎస్ అధికార ప్రతినిధి కురువ విజయ్ కుమార్ పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *