ఆర్థిక శాఖ సలహాదారుగా రఘునందన్ రావును నియమించాలి

ఆర్థిక శాఖ సలహాదారుగా రఘునందన్ రావును నియమించాలి

ఆర్థిక శాఖ సలహాదారుగా రఘునందన్ రావును నియమించాలి

విశ్వం న్యూస్, హైదరాబాద్‌, 10 నవంబర్ 2026 : తెలంగాణ వాణిజ్య పన్నుల శాఖలో గత పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఉద్యోగుల సమస్యలను కేవలం ఏడాది కాలంలో పరిష్కరించేందుకు ప్రత్యేక చొరవ చూపిన రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్, ఎక్సైజ్ శాఖ రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎం. రఘునందన్ రావుపై తెలంగాణ కమర్షియల్ టాక్సెస్ సర్వీసెస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ ప్రశంసలు కురిపించారు. జూనియర్ అసిస్టెంట్ నుంచి అడిషనల్ కమిషనర్ స్థాయి వరకు ఉద్యోగులకు వారి సీనియారిటీ ఆధారంగా పదోన్నతులు కల్పించడంలో ఆయన కీలక పాత్ర పోషించారని కొనియాడారు.

గతంలో పలువురు కమిషనర్ల దృష్టికి ఉద్యోగుల సమస్యలను తీసుకెళ్లినా పరిష్కారం లభించలేదని ముజాహిద్ హుస్సేన్ తెలిపారు. ముఖ్యంగా సీనియారిటీ, బదిలీలు, పదోన్నతులు తదితర అంశాలకు సంబంధించి ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్న సమస్యలపై గతంలో అనేక వినతిపత్రాలు సమర్పించినా ఫలితం లేకుండా పోయిందన్నారు.

అయితే ఏడాది క్రితం బాధ్యతలు చేపట్టిన ఎం. రఘునందన్ రావు ఉద్యోగ సంఘం సమర్పించిన వినతిపత్రాలపై సానుకూలంగా స్పందించి సమస్యల పరిష్కారానికి కృషి చేశారని పేర్కొన్నారు. వందలాది మంది ఉద్యోగుల సీనియారిటీని క్రమబద్ధీకరించి, జూనియర్ అసిస్టెంట్ నుంచి అడిషనల్ కమిషనర్ వరకు అర్హత, సీనియారిటీ ఆధారంగా పదోన్నతులు కల్పించడంతో పాటు ఖాళీలకు అనుగుణంగా బదిలీలు చేపట్టారని వెల్లడించారు.

ఉద్యోగులు తమ సమస్యలతో కమిషనర్‌ను కలిసినప్పుడు చిరునవ్వుతో స్పందిస్తూ, సమస్య పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని భరోసా ఇవ్వడం ఆయన ప్రత్యేకత అని ముజాహిద్ హుస్సేన్ అన్నారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా వాణిజ్య పన్నుల శాఖ కార్యాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగుల్లో సంతోషం నెలకొందని తెలిపారు.

రాష్ట్ర ఆదాయాన్ని పెంచడంలోనూ కీలక పాత్ర : ఉద్యోగుల సమస్యల పరిష్కారంతో పాటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆదాయాన్ని పెంచడంలోనూ రఘునందన్ రావు ప్రత్యేక చొరవ చూపుతున్నారని అసోసియేషన్ అధ్యక్షుడు పేర్కొన్నారు. జీఎస్టీ ఆదాయ వృద్ధి, పన్నుల వసూళ్లలో తెలంగాణకు మంచి గుర్తింపు తీసుకురావడానికి ఆయన కృషి చేస్తున్నారని ప్రశంసించారు.

గతంలో దీపావళి సందర్భంగా టపాసుల విక్రయాలకు సంబంధించిన పన్నుల వసూళ్లపై పెద్దగా దృష్టి సారించలేదని, రఘునందన్ రావు బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈ అంశంపై ప్రత్యేక దృష్టి పెట్టి ప్రభుత్వానికి ఆదాయం సమకూరేలా చర్యలు తీసుకున్నారని తెలిపారు. ఈ ఏడాది కూడా దీపావళి సందర్భంగా టపాసుల వ్యాపారంపై పన్నుల వసూళ్ల ద్వారా ప్రభుత్వ ఖజానాకు గణనీయమైన ఆదాయం వచ్చేలా కృషి చేశారని కొనియాడారు.

దేశంలోని ఇతర రాష్ట్రాల్లో అమలవుతున్న ఆదాయ వృద్ధి విధానాలను అధ్యయనం చేస్తూ, వాటిని తెలంగాణలో అమలు చేసేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారని తెలిపారు. వివిధ శాఖలతో సమన్వయం చేసుకుంటూ ప్రభుత్వ ఖజానాకు మరింత ఆదాయం సమకూర్చే దిశగా పనిచేస్తున్నారని పేర్కొన్నారు.

ఆర్థిక శాఖ ముఖ్య సలహాదారుగా నియమించాలి : ప్రజా ప్రయోజనాలు, ప్రభుత్వ ఆదాయం, ఉద్యోగుల సంక్షేమం కోసం నిబద్ధతతో పనిచేస్తున్న ఇలాంటి సమర్థవంతమైన అధికారిని ప్రభుత్వం సేవలను కొనసాగించుకునేలా చర్యలు తీసుకోవాలని ముజాహిద్ హుస్సేన్ విజ్ఞప్తి చేశారు.

రఘునందన్ రావు పదవీ విరమణ వయస్సు, సర్వీసును పొడిగించే అంశాన్ని ప్రభుత్వం పరిశీలించాలని కోరారు. అది సాధ్యం కాని పక్షంలో తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖకు ముఖ్య సలహాదారుగా క్యాబినెట్ హోదాలో నియమించాలని సూచించారు.

ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు ప్రత్యేక చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. రఘునందన్ రావు వంటి అనుభవజ్ఞుడైన అధికారి ఆర్థిక శాఖకు సలహాదారుగా కొనసాగితే ప్రభుత్వ ఆదాయ వృద్ధికి, ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీల అమలుకు మరింత దోహదపడుతుందని మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ అభిప్రాయపడ్డారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *