స్పౌజ్ బాధితుల అరెస్టు గర్హనీయం

> స్పందించాలని సంఘాలకు విన్నపాలు
> టీచర్లను రౌడీలనడం ఆక్షేపణీయం
> బీసీటీయు రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు పెరుమాండ్ల సాంబమూర్తి
వరంగల్, జనవరి 22 (విశ్వం న్యూస్) : రాష్ట్ర ముఖ్యమంత్రి కేసిఆర్ ఉపాధ్యాయుల దంపతులను ఓకే జిల్లాలో ఉద్యోగం చేసేలా చర్యలు తీసుకుంటామని ఇచ్చిన హామీలను అమలుచేయాలని కోరుతు డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఎదుట శాంతియుతంగా మౌనదీక్ష చేపట్టిన స్పౌజ్ బాధితులను పోలీసులు అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు బీసీటీయు రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు పెరుమాండ్ల సాంబమూర్తి ప్రకటించారు. కాజీపేట సోమిడిలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. సీఎం హామీని నెరవేర్చేలా ప్రభుత్వానికి తగిన నివేదికలను ఇవ్వకుండా విద్యాశాఖ ఉన్నతాధికారులు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. మహిళా ఉపాధ్యాయులు తమ తమ పిల్లలతో చేపట్టిన మౌనదీక్షపై పోలీసులు దారుణంగా వ్యవహరించిన తీరు ప్రభుత్వాన్ని బదునాం చేసినట్లయిందన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 19 జిల్లాలలో స్పౌజ్ బదిలీలు చేపట్టి 13 జిల్లాలో స్పౌజ్ బదిలీలను బ్లాక్ చేయడం ఏ మేరకు సమంజసమైందని ప్రశ్నించారు. రాష్ట్ర వ్యాప్తంగా వేర్వేరుగా నిబంధనలు ఉంటాయా..? రూల్స్ అన్ని జిల్లాలకు ఒకేలా అమలుచేయరా..? అని మండిపడ్డారు. 13 జిల్లాలో స్పౌజ్ లను బ్లాక్ చేయడంతో ఏడాది నుంచి వందల కిలోమీటర్లు ప్రయాణం చేసి చాలా మంది మహిళా ఉపాధ్యాయులు తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారని, కొంతమంది తీవ్ర ఒత్తిడికి గురై ప్రయాణంలో రోడ్డు ప్రమాదాలకు గురై మృతి చెందిన సంఘటనలు చోటు చేసుకుంటున్నా ప్రభుత్వం సానుకూలంగా స్పందించకపోవడం విచారకరమన్నారు. ఏడాది పాటు ఇబ్బందులకు గురిచేస్తున్నా స్పౌజ్ బాధితులు శాంతియుతంగా విన్నపాలు చేస్తు మౌనదీక్ష చేపట్టారే కానీ ఎక్కడా రౌడీల్లాగా వ్యవహరించలేదన్నారు.

బదిలీలు పదోన్నతులు పూర్తి చేస్తే భవిష్యత్తులో తమకు న్యాయం జరగదనే బాధతోనే బాధిత ఉపాధ్యాయులు మౌనదీక్ష చేపట్టిన విషయం డైరెక్టర్ అర్థం చేసుకుంటే బాగుండేదన్నారు.
వృద్ద మహిళలు, పిల్లలని కూడా చూడకుండా పోలీసులు బలవంతంగా ఈడ్చికెళ్ళి వాహనాల్లోకి నెట్టివేసి పోలీస్ స్టేషన్లకు తరలించిన తీరు దారుణమన్నారు. తాము ఏడాది పొడవునా ఎదుర్కొంటున్న ఇబ్బందులను తెలుపడానికి ఉపాధ్యాయ దంపతులు వారి వారి పిల్లలు, కుటుంబ సభ్యులతో కలిసి వచ్చిన టీచర్లను రౌడీలని స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ శ్రీదేవసేన వ్యాఖ్యలు చేయడాన్ని ప్రభుత్వం సీరియస్ గా తీసుకోవాలని కోరారు. సీఎం ఇచ్చిన హామీని నెరవేర్చి తమ ఇబ్బందులు తొలగించాలని వచ్చిన వారిని డైరెక్టర్ తమ ఛాంబర్ కు పిలుచుకుని ఏ బడి…సీఎల్ అనుమతి ఉందా కేసులను నమోదు చేయిస్తా అంటూ బెదిరింపులకు దిగిన తీరు గమనిస్తే భవిష్యత్తు లో ఉపాధ్యాయ సంఘాలు చేపట్టే ఉద్యమాలకు టీచర్లు తరలివస్తారా..? ఈ బెదిరింపులపై సంఘాలు సీరియస్ గా స్పందించాల్సిన అవసరం లేదా..అని ప్రశ్నించారు. అలాగే 13 జిల్లాల స్పౌజ్ బ్లాక్ ను ఎత్తివేయించి కొంతమందికి కాకుండా అందరికీ న్యాయం చేసేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాల్సిన బాధ్యత అన్ని ఉపాధ్యాయ సంఘాలపై ఉందన్నారు. ఉపాధ్యాయ సంఘాలు స్పౌజ్ సమస్యపై చిత్తశుద్ధితో వ్యవహరించాలన్నారు. స్పౌజ్ బదిలీలను పూర్తి చేసిన తర్వాతనే బదిలీలు, పదోన్నతులు చేపట్టే విధంగా సీఎం కేసిఆర్ దృష్టికి ఉపాధ్యాయ సంఘాలు తీసుకురావాలని కోరారు. అలాకాకుండా జిఓ 317 అమలు మాదిరిగా 13 జిల్లాలో స్పౌజ్ బదిలీలను చేపట్టకుండా బదిలీలు.. పదోన్నతులను హడావుడిగా పూర్తి చేయిస్తే రానున్న ఎమ్మెల్సి ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పడానికి బాధితులు సిద్ధంగా ఉన్నారన్నారు. సంఘాలు స్పౌజ్ సమస్యపై చిత్తశుద్ధిని చాటుకునే సమయం ఆసన్నమైందన్నారు ఏదిఏమైనా 13 జిల్లాలో స్పౌజ్ బ్లాక్ ను ఎత్తివేసిన తర్వాతనే బదిలీలను.. పదోన్నతులు చేపట్టే విధంగా ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
