కాంగ్రెస్‌కి చెంపదెబ్బ ఇవ్వడానికి
ఆటో కార్మికులు సిద్ధం! :
ఎమ్మెల్సీ డా. దాసోజు శ్రవణ్

హైదరాబాద్, అక్టోబర్ 27 (విశ్వం న్యూస్) : జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని షేక్‌పేట్ డివిజన్‌లోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రి శ్రీ వేముల ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్సీ డా. దాసోజు శ్రవణ్, మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజుల సురేందర్, యువ నాయకులు ముఠా జైసింహ, పటోళ్ల కార్తీక్ రెడ్డి, హెచ్‌వైసీ సల్మాన్ తదితరులు మీడియాతో మాట్లాడారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ డా. దాసోజు శ్రవణ్ గారు మాట్లాడుతూ – “ఆటో డ్రైవర్ల నోట్లో మన్ను కొట్టినట్టుగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తోంది. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ పథకాన్ని అనాలోచితంగా అమలు చేయడం వల్ల మహిళలు ఒకరిపై ఒకరు దాడులు చేసుకునే పరిస్థితి ఏర్పడింది. ప్రజల జీవితాలను మార్చాల్సిన ప్రభుత్వ నిర్ణయాలు గందరగోళాన్ని సృష్టిస్తున్నాయి. ఒక పాలసీ తీసుకున్నప్పుడు దాని పర్యవసానాలు కూడా ఆలోచించాలి కానీ ఈ ప్రభుత్వం అలా చేయడం లేదు,” అన్నారు.
“ఇప్పటివరకు 161 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకున్నా కూడా ప్రభుత్వం స్పందించకపోవడం అత్యంత విచారకరం. ఆటో కార్మికులకు సహాయం చేయాల్సింది పోయి, నిర్దయగా చాలానాలు విధించి వారిని ఆర్థికంగా దెబ్బతీస్తోంది. ఆటో కార్మికుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు బీఆర్ఎస్ పార్టీ నిరంతరం పోరాటం చేస్తోంది. ఆటో డ్రైవర్లకు న్యాయం జరిగే వరకు మేము మౌనంగా ఉండం,” అని స్పష్టం చేశారు.
ప్రజల ఆత్మగౌరవం, అభివృద్ధి ఆశలను తాకిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పే సమయం ఆసన్నమైందని పేర్కొంటూ ఆయన అన్నారు – “ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రజల ఆగ్రహానికి ప్రతీకగా మారనుంది. ఆటో కార్మికులు, వర్కింగ్ క్లాస్ ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వానికి గట్టి చెంపదెబ్బ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు,” అని తెలిపారు.
ఈ సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను తీవ్రంగా ఖండించారు.