కుష్ఠు వ్యాధి గుర్తింపుపై అవగాహన
కుష్ఠు వ్యాధి గుర్తింపుపై అవగాహన

నాగారం, డిసెంబర్ 16 (విశ్వం న్యూస్) : నాగారం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కుష్ఠు వ్యాధి నిర్ధారణపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమం ద్వారా ఆరోగ్య సిబ్బంది, ఆశ కార్యకర్తలకు కుష్ఠు వ్యాధి లక్షణాల గుర్తింపు, నివారణ చర్యలపై సమగ్ర అవగాహన కల్పించారు.
ఈ నెల 18 నుంచి 31 వరకు నిర్వహించనున్న LCDC (కుష్ఠు వ్యాధి కేసుల అనుమానిత నిర్ధారణ కార్యక్రమం) నేపథ్యంలో ఈ అవగాహన సదస్సును ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారి డాక్టర్ యనగందుల నాగరాజు మాట్లాడుతూ, ఆశ కార్యకర్తలు ప్రతి ఇంటిని సందర్శించి స్పర్శ లేని రాగి రంగు మచ్చలను గుర్తించాల్సిన అవసరం ఉందన్నారు.

కుష్ఠు వ్యాధిని సకాలంలో గుర్తించి ఎమ్‌డీటీ (MDT) చికిత్స అందిస్తే పూర్తిగా నయం అవుతుందని తెలిపారు. అయితే నిర్లక్ష్యం చేస్తే వ్యాధి ముదిరి అంగవైకల్యం ఏర్పడే ప్రమాదం ఉందని హెచ్చరించారు. కుష్ఠు వ్యాధిగ్రస్తుల పట్ల వివక్ష చూపకుండా ప్రజలు సహకరించాలని ఆయన కోరారు.
ఈ కార్యక్రమంలో CHO మాలోతు బిచ్చు నాయక్, డాక్టర్ హర్షవర్ధన్, HE విమలమ్మ, PHN అరుణ కుమారి, సుజాత, సూపర్వైజర్ రామచంద్ర, నజియా, సరస్వతి, యాదగిరి, ప్రవీణ్ రెడ్డితో పాటు ఇతర ఆరోగ్య సిబ్బంది, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.
