
- శ్రీదేవి మంత్రి (తెలంగాణ అధికార భాషా సంఘం మాజీ చైర్మన్)
హైదరాబాద్, మే 11 (విశ్వం న్యూస్) : ఆరు గ్యారంటీలు,అనేక వందల హామీలతో అరచేతిలో వైకుంఠాన్ని చూపించి,అందలమెక్కి-ఆనక ఏరుదాటాక తెప్ప కాల్చిన చందంగా నాలుక మడతపెడుతున్న నక్కజిత్తులమారి నాయకులను చూసి నిశ్చేష్టులవుతున్న దీనుల మదిలోని మాట-“ మాకు కేసిఆర్ మళ్ళీ ముఖ్యమంత్రిగా రావాలి”
కరెంటు లేక నీళ్ళు రాక,ఉపాధి లేక వలసపోలేక విలవిలలాడుతున్న జనం మనస్సులలోనుండి ధనుస్సులా ఎక్కుపెట్టబడుతున్న ప్రశ్న-“ఆ అపర భగీరథుడెక్కడ!ఆ ఆపద్భాంధవుడెక్కడ!ఆ నిరంతర వెలుగుల చంద్రశేఖరుడెక్కడ?”

అడుగంటుతున్న భూగర్భజలాలు,ఎండుతున్న పంటపొలాలు, నిండుగా నీళ్లున్న పొలాల దరిచేరని జలాశయాలు, ఉరుముతూ మరణశయ్యవైపు తరుముతున్న ఋణాలు,అమలుకాని ఋణమాఫీ హామీలు, అతలాకుతలమవుతున్న బతుకులతో చితికిపోతున్న రైతన్నలు అడుగుతున్న ప్రశ్న “ఆ రైతుబంధు ఎక్కడ?మా రైతు జగతి కల్పతరువు ఎక్కడ?”
ఆసరాఫించన్లు పెంచుతామని, కల్యాణలక్ష్మి,షాదీముబారక్ శుభకార్యక్రమాలలో అన్న కేసిఆర్ ఇచ్చిన తోఫాలకు అదనంగా తులం బంగారంతో సింగారిస్తామని ఊరించి ఆనక చేతులెత్తేసిన రంగులుమార్చే వాగ్దానభంగ ఊసరవెల్లులను చూసి మోసపోయిన మహిళామణుల కన్నీటిబిందువుల సాక్షిగా ఉబికొస్తున్న ప్రశ్న -“మా అన్న కేసిఆర్ ఎక్కడ?”మా ఆపద్భాంధవుడు మరలా ముఖ్యమంత్రిగా రావాలి?”
నిరుద్యోగ భృతిలేక, ఉద్యోగాలురాక, పాత ప్రభుత్వ ఘనతలను తమ ఖాతాలో వేసుకొని ఊరేగుతున్న నేతలను చూసి నిలువునా నివ్వెరపోతున్న యువత అడుగుతున్న ప్రశ్న-“బాపు కేసిఆర్” మళ్ళీ రావాలి”