హైదరాబాద్

భారత ఉప రాష్ట్రపతిగా బిసి సామజిక వర్గానికి అవకాశం ఇవ్వాలి

భారత ఉప రాష్ట్రపతిగా బిసి సామజిక వర్గానికి అవకాశం ఇవ్వాలి

  • బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి మనోజ్ పండ్ల డిమాండ్

హైదరాబాద్, జూలై 26 (విశ్వం న్యూస్) : భారత ఉపరాష్ట్రపతి పదవిని బీసీ వర్గానికి చెందినవారికి కేటాయించాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి మనోజ్ పండ్ల డిమాండ్ చేశారు. శనివారం నిర్వహించిన బీసీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, దేశానికి గౌరవంగా నిలిచే విధంగా తొలిసారిగా ఆదివాసి మహిళ ద్రౌపది ముర్ము గారిని రాష్ట్రపతిగా ఎంపిక చేసిన ప్రధాని నరేంద్ర మోడీ గారు, అదే విధంగా ఉపరాష్ట్రపతి పదవిని కూడా బీసీ వర్గానికి ఇచ్చి బీసీల పట్ల తన వైఖరిని నిరూపించాలని కోరారు.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్ కల్పించిన నేపథ్యంలో, కేంద్ర ప్రభుత్వం కూడా అదే విధంగా బీసీలకు గౌరవం ఇచ్చే నిర్ణయాలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. గతంలో గవర్నర్లుగా పని చేసిన అనుభవజ్ఞులు బీసీ వర్గాల్లో ఉన్నారని, వారిని లేదా ఇతర విద్యావంతులైన బీసీ మేధావులను పరిశీలించి ఉపరాష్ట్రపతి పదవికి అవకాశం ఇవ్వాలని సూచించారు.

కేంద్రం ఇటీవల మూడు గవర్నర్ పోస్టులకు ముగ్గురు అగ్రకులస్తులను నియమించిందని విమర్శించిన మనోజ్ పండ్ల, తెలంగాణ బీజేపీ అధ్యక్షునిగా కూడా అగ్రకుల వ్యక్తిని నియమించడాన్ని ఖండించారు. “మా బీసీ ముద్దుబిడ్డ ఈటెల రాజేందర్ గారికి అవకాశం ఎందుకు ఇవ్వలేదో స్పష్టత ఇవ్వాలి,” అని ప్రశ్నించారు.

గతంలో బీసీ వర్గానికి చెందిన జగదీప్ ధన్ఖడ్ గారికి ఉపరాష్ట్రపతిగా అవకాశం కల్పించారని గుర్తుచేస్తూ, ఆయనను పూర్తికాలం పదవిలో కొనసాగనివ్వకుండా రాజకీయంగా పక్కనబెట్టిన తీరును ఖండించారు. బీసీల పట్ల నిజమైన చిత్తశుద్ధి ఉంటే మరోసారి ఉపరాష్ట్రపతి పదవిని బీసీ సామాజిక వర్గానికి ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *