ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు గారి బాన్సువాడ పర్యటన

ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు గారి బాన్సువాడ పర్యటన

బాన్సువాడ, మార్చి 1 (విశ్వం న్యూస్) : తెలంగాణ తిరుపతిగా ప్రసిద్దిగాంచిన బాన్సువాడ నియోజకవర్గ పరిధిలోని బిర్కూర్ మండలం తిమ్మాపూర్ లో గల శ్రీ వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా జరిగిన కళ్యాణోత్సవంలో పాల్గొనేందుకు వచ్చిన సీఎం కేసీఆర్ పర్యటన దిగ్విజయంగా కొనసాగింది. స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆహ్వానం మేరకు శ్రీదేవి, భూదేవి సమేత వేంకటేశ్వరస్వామి కళ్యాణోత్సవం లో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సతీసమేతంగా బుధవారం ఉదయం హైదరాబాద్ నుంచి బయలుదేరి వాయుమార్గం లో మధ్యాహ్నం 12 గంటలకు బాన్సువాడ చేరుకున్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ దంపతులకు స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఘనస్వాగతం పలికారు. అనంతరం దేవాలయ అభివృద్ధికి సంబంధించిన వివరాలతో కూడిన పైలాన్ ను సీఎం కేసీఆర్ ఆవిష్కరించారు. అక్కడ నుంచి నేరుగా దేవాలయంకు చేరుకున్న సీఎం కేసీఆర్ దంపతులను దేవస్థాన పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి కుటుంబం చేయించిన రెండు కిలోల స్వర్ణ కిరీటాన్ని స్వామి వారికి సీఎం కేసీఆర్ దంపతులు సమర్పించారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సీఎం కేసీఆర్ దంపతులకు వేద పండితులు ఆశీర్వచనము ఇచ్చారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ దంపతులను స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి దంపతులు పట్టువస్త్రాలతో సన్మానించారు. వేంకటేశ్వర దేవాలయం తరపున సీఎం కేసీఆర్ కు జ్ఞాపికను అందజేశారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో సిఎం మొక్క నాటారు.
దైవ దర్శనం అనంతరం
అక్కడే ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సిఎం పాల్గొన్నారు. తర్వాత అక్కడే స్పీకర్ ఏర్పాటు చేసిన మధ్యాహ్న భోజన ఆతిథ్యాన్ని స్వీకరించారు. స్పీకర్ ఆహ్వానం మేరకు వారి నివాసానికి వెళ్లారు. అక్కడ స్థానిక ప్రజా ప్రతినిధులను ప్రజలను కలిశారు. అనంతరం హైదరాబాద్ కు తిరిగి చేరుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *