మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్‌పై శ్రవణ్ ధ్వజం

హైదరాబాద్, జనవరి 28, 2026 (విశ్వం న్యూస్) : మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్‌పై డాక్టర్ శ్రవణ్ కుమార్ దాసోజు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. షెడ్యూల్ విడుదల నుంచి నోటిఫికేషన్ వరకు ఒక్క రోజు గడువుకూడా ఇవ్వకుండా నిర్ణయించడం దేశ చరిత్రలోనే అరుదైన దారుణమని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీకైన మేడారం సమ్మక్క–సారలమ్మ జాతరను విస్మరించి ఎన్నికలు పెట్టడం కోట్లాది భక్తుల విశ్వాసాలను దెబ్బతీయడమేనని విమర్శించారు.
ఎన్నికల కమిషన్ ప్రభుత్వం చేతిలో ‘తోలుబొమ్మ’లా మారిందని ఆరోపించిన డాక్టర్ శ్రవణ్, ఎన్నికలంటే ఫైళ్లను ఆఫీసులో క్లియర్ చేసినట్టు చుట్టేయడం కాదని—అవి ప్రజాస్వామ్యానికి పునాదులని గుర్తు చేశారు. రాష్ట్రంలో రాజ్యాంగ సంక్షోభం ఏదీ లేకపోయినా ఇంత హడావుడిగా ఎన్నికలు నిర్వహించడంపై అనుమానాలు వ్యక్తం చేశారు.
ఈ షెడ్యూల్ ప్రతిపక్షాలకు, మహిళలకు, కొత్త అభ్యర్థులకు శాపమై అధికార పార్టీకి వరంగా మారిందని, ఇది సమాన అవకాశాల పోటీ కాదని—వ్యవస్థీకృత అసమానత సృష్టించడమేనని అన్నారు. సమయం కుదించడం వల్ల డబ్బు, మద్యం, కండబలం ప్రభావం పెరిగే ప్రమాదముందని హెచ్చరించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వంతో కుమ్మక్కై స్థానిక సంస్థల ఎన్నికలను ‘మేనేజ్డ్ డ్రామా’గా మార్చేశారంటూ తీవ్ర ఆరోపణలు చేశారు.
ఈ పరిస్థితుల్లో రాజ్యాంగ పరిరక్షకుడిగా గవర్నర్ తక్షణమే జోక్యం చేసుకుని ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని డాక్టర్ శ్రవణ్ కుమార్ దాసోజు డిమాండ్ చేశారు.