మేడారం జాతర సందర్భంగా
రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ శుభాకాంక్షలు

హైదరాబాద్, జనవరి 27, 2026 (విశ్వం న్యూస్) : మేడారం సమ్మక్క–సారలమ్మ జాతర ప్రారంభం సందర్భంగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు రాష్ట్ర ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ త్యాగానికి, ధిక్కారానికి ప్రతీకలైన ఆదివాసీ దేవతలు సమ్మక్క–సారలమ్మల ఆశీస్సులు రాష్ట్ర ప్రజలపై ఎల్లప్పుడూ ఉండాలని ఆయన ఆకాంక్షించారు.
కొంగు బంగారమై కోరిన కోరికలు తీర్చే తమ ఇలవేల్పులకు మొక్కులు తీర్చుకునేందుకు కోట్లాదిగా భక్తులు తరలివచ్చే మేడారం జాతర, కుంభమేళాను తలపిస్తూ ప్రపంచ ప్రసిద్ధ ఆధ్యాత్మిక కేంద్రంగా కొనసాగుతోందని కేసీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ ఆదివాసీ గిరిజన సమాజాల సబ్బండ కులాల సంస్కృతి, సంప్రదాయాలకు పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో పెద్దపీట వేసిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు. గోదావరి లోయ పరీవాహక ప్రాంతాల అభివృద్ధితో పాటు ఆధ్యాత్మిక వికాసం కూడా సమాంతరంగా కొనసాగిందని తెలిపారు.
అన్ని రంగాల్లో తెలంగాణ ప్రగతి మరింత పుంజుకొని, రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలతో, సుభిక్షంగా జీవించేలా దీవించాలని సమ్మక్క–సారలమ్మ దేవతలను కేసీఆర్ ప్రార్థించారు.