వాణిజ్య పన్నుల శాఖ అధికారులపై తప్పుడు ప్రచారం ఆపాలి

వాణిజ్య పన్నుల శాఖ అధికారులపై తప్పుడు ప్రచారం ఆపాలి

  • నిజాయితీగా పనిచేస్తున్న అధికారులను బద్నాం చేయడం తగదు: తెలంగాణ కమర్షియల్ టాక్సెస్ సర్వీసెస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్

విశ్వం న్యూస్/హైదరాబాద్, సెప్టెంబర్ 28: వాణిజ్య పన్నుల శాఖలో నిజాయితీగా, అంకితభావంతో పనిచేస్తున్న అధికారులపై ఒకరిద్దరు స్వార్థపరులు కావాలనే తప్పుడు ఆరోపణలు చేయిస్తూ శాఖ ప్రతిష్ఠను దెబ్బతీసే ప్రయత్నాలను వెంటనే నిలిపివేయాలని తెలంగాణ కమర్షియల్ టాక్సెస్ సర్వీసెస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ విజ్ఞప్తి చేశారు.

వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ కార్యాలయంలో పనిచేస్తున్న అదనపు కమిషనర్ ఎంతో నిబద్ధతతో విధులు నిర్వహిస్తున్నారని, అలాంటి అధికారిపై ఉద్దేశపూర్వకంగా తప్పుడు ప్రకటనలు చేయించడం బాధాకరమని ఆయన అన్నారు. శాఖకు సంబంధించిన సమస్యలను పరిష్కరించేందుకు అధికారులు నిరంతరం కృషి చేస్తున్న సమయంలో వ్యక్తిగత ప్రయోజనాల కోసం తప్పుడు ప్రచారం చేయడం సరికాదన్నారు.

వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్‌గా ఎం. రఘునందన్ రావు బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఉద్యోగులు, అధికారులకు సంబంధించిన పలు పెండింగ్ సమస్యల పరిష్కారంపై దృష్టి సారించారని ముజాహిద్ హుస్సేన్ తెలిపారు. ముఖ్యంగా దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ప్రమోషన్లు, బదిలీలు తదితర అంశాల్లో ఫైళ్లను కదిలించి ఉద్యోగులకు ప్రయోజనం కలిగేలా చర్యలు తీసుకుంటున్నారని పేర్కొన్నారు.

ఉద్యోగులకు ఏవైనా సమస్యలు ఉంటే ఉన్నతాధికారులను కలిసి తమ సమస్యలను వివరించుకునే అవకాశం ఉండటం సహజమని, సమస్యల పరిష్కారం కోసం సంబంధిత అధికారులను పిలిపించుకోవడం లేదా ఆన్‌లైన్, ఫోన్ ద్వారా పనులను సమన్వయం చేయడం విధి నిర్వహణలో భాగమేనని ఆయన అన్నారు. నిజామాబాద్‌లో విధులు నిర్వహిస్తున్న అధికారిని కమిషనర్ కార్యాలయానికి పిలిపించి శాఖాపరమైన పనులు చేయించడాన్ని తప్పుగా చిత్రీకరించడం సమంజసం కాదన్నారు.

కమిషనర్ కార్యాలయంలో పనిచేస్తున్న అదనపు కమిషనర్ ఉదయం నుంచి రాత్రి వరకు విధుల్లో నిమగ్నమై ఉద్యోగులు, అధికారులకు అందుబాటులో ఉంటున్నారని ముజాహిద్ హుస్సేన్ తెలిపారు. అలాంటి అధికారులపై కావాలనే తప్పుడు ఆరోపణలు చేయించడం, బద్నాం చేసే ప్రయత్నాలు చేయడం తగదన్నారు.

అదేవిధంగా శాఖలో నిజాయితీగా పనిచేస్తున్న సూపరింటెండెంట్‌పై కూడా తప్పుడు ప్రచారం చేయడం బాధాకరమని ఆయన అన్నారు. వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగులు, అధికారులు ఎదుర్కొంటున్న సమస్యలను శాఖ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకోవాలని సూచించారు.

ఎం. రఘునందన్ రావు బాధ్యతలు చేపట్టిన తర్వాత హైదరాబాద్‌లో కొత్త జాయింట్ కమిషనర్ కార్యాలయాలు, సీటీఓ కార్యాలయాల ఏర్పాటుకు చర్యలు తీసుకున్నారని ముజాహిద్ హుస్సేన్ పేర్కొన్నారు. ఉద్యోగులు, అధికారుల సమస్యలను పరిష్కరించేందుకు ఆయన తీసుకుంటున్న చర్యలను గుర్తించాలని అన్నారు.

శాఖ ప్రతిష్ఠను కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఉద్యోగిపైనా ఉందని, వ్యక్తిగత ప్రయోజనాల కోసం తప్పుడు ప్రకటనలు చేయించడం, నిజాయితీగా పనిచేస్తున్న అధికారులను బద్నాం చేయడం వెంటనే మానుకోవాలని మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ స్పష్టం చేశారు. సమస్యలు ఉంటే శాఖ అంతర్గత వ్యవస్థ ద్వారా పరిష్కరించుకోవాలని, తప్పుడు ప్రచారాలకు పాల్పడకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆయన కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *