ఎఫ్‌సీఆర్‌ఐకు వనజీవి
రామయ్య పేరు పెట్టాలి

- తెలంగాణ కుమ్మర సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నేదునూరి కనకయ్య విజ్ఞప్తి
హైదరాబాద్, ఏప్రిల్ 13 (విశ్వం న్యూస్) : పర్యావరణ ఉద్యమానికి తన జీవితాన్ని అంకితం చేసిన పద్మశ్రీ అవార్డు గ్రహీత, వనజీవి దరిపెల్లి రామయ్య పేరును ములుగు జిల్లా లోని ఫారెస్ట్ కాలేజ్ అండ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (యూనివర్సిటీ ఆఫ్ ఫారెస్ట్రీ – ఎఫ్‌సీఆర్‌ఐ)కు పెట్టాలని తెలంగాణ కుమ్మర సంఘం రాష్ట్ర శాఖ (880/2014) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేసింది.

ఈ మేరకు సంఘం రాష్ట్ర కార్యాలయంలో శనివారం జరిగిన శ్రద్ధాంజలి సభలో తీర్మానం చేశారు. సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నేదునూరి కనకయ్య అధ్యక్షతన సమావేశం జరగగా, వనజీవి రామయ్య జీవిత సాధనపై వివిధ నేతలు ప్రసంగించారు.
కనకయ్య మాట్లాడుతూ – వృక్షాల రక్షణే మానవ రక్ష అని నమ్మిన రామయ్య గారు, మొక్కలను తన కుటుంబ సభ్యుల్లా చూసుకుంటూ వారికే చెట్ల పేర్లు పెట్టారని గుర్తు చేశారు. హరితహారం కార్యక్రమానికి బ్రాండ్ అంబాసిడర్‌గా పనిచేసిన రామయ్య గారి జీవితం ఆరవ తరగతి పాఠ్యాంశంగా చేర్చడాన్ని గర్వంగా భావిస్తున్నట్లు చెప్పారు.
సంఘం ప్రధాన కార్యదర్శి కొల్లూరి అనిల్ కుమార్ మాట్లాడుతూ – ‘‘రామయ్య గారు రెండు చేతులా విత్తనాలను చల్లి, లక్షలాది చెట్లను పెంచిన అభినవ అశోకుడు. ఆయన ఆశయాల సాధనకే నేడు ప్రతి యువకుడు పర్యావరణ రక్షణలో భాగస్వామిగా మారాలి’’ అని పిలుపునిచ్చారు.
హైకోర్టు సీనియర్ అడ్వకేట్ మలికంటి వెంకన్న మాట్లాడుతూ – మొక్కల మాధ్యమంగా పర్యావరణ పరిరక్షణకు నడుం బిగించిన రామయ్య ఇంటిని మొక్కల మ్యూజియంగా మార్చాలన్న ఆయన కోరికను ప్రభుత్వం నెరవేర్చాలని కోరారు. అలాగే కరెన్సీ నోట్లపై చెట్ల బొమ్మలను ముద్రించాలని సూచించారు.
సభలో రెండు నిమిషాల మౌనం పాటించి రామయ్య గారికి శ్రద్ధాంజలి ఘటించారు. కార్యక్రమంలో సంఘం ఉపాధ్యక్షులు, కార్యదర్శులు, కోశాధికారులు, వివిధ జిల్లాల ప్రతినిధులు పాల్గొన్నారు.

- శ్రీ వనజీవి దరిపల్లి రామయ్య గారికి అశృనివాళి శ్రద్ధాంజలి
–మీ పొరళ్ళ సత్యనారాయణ ఉమ మాజీ సర్పంచ్
(BRS మొగలాయికోట)