గచ్చిబౌలిలో విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్య

గచ్చిబౌలిలో విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్య
విశ్వం న్యూస్, హైదరాబాద్, 8 నవంబర్ 2026 : నగరంలోని గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్ పరిధిలో తీవ్ర విషాద ఘటన చోటుచేసుకుంది. గౌలిదొడ్డిలోని జయభేరి నిర్వాణ అపార్ట్‌మెంట్స్‌లో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందడం కలకలం రేపింది.
అపార్ట్‌మెంట్స్‌లోని సీ బ్లాక్, ఏడో అంతస్తులో ఉన్న ఫ్లాట్ నంబర్ 702లో నివాసముంటున్న బతుల మారెడ్డి (65), ఆయన భార్య బతుల భారతి (60), కుమారుడు బతుల నిశాంత్‌రెడ్డి (38) ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులకు సమాచారం అందింది. ఆదివారం ఉదయం 8.40 గంటల సమయంలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.
ప్రాథమిక సమాచారం ప్రకారం.. కుటుంబ సభ్యులు గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలు, కుటుంబపరమైన ఇబ్బందులతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. అయితే ముగ్గురి మృతికి దారితీసిన కచ్చితమైన కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.
సమాచారం అందుకున్న గచ్చిబౌలి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. పోలీసుల విచారణ పూర్తయిన తర్వాత ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.
