జీఓ 97పై ఆనంద్ మహీంద్రాను నిలదీసిన దాసోజు

జీఓ 97పై ఆనంద్ మహీంద్రాను నిలదీసిన దాసోజు

జీఓ 97పై ఆనంద్ మహీంద్రాను నిలదీసిన దాసోజు

  • జీఓ 97 ద్వారా పాలిటెక్నిక్, ఐటీఐ కళాశాలలను యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ పరిధిలోకి తీసుకురావడం పై పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రాను నిలదీసిన బీఆర్ఎస్ ఎంఎల్సీ దాసోజు

విశ్వం న్యూస్/హైదరాబాద్, ఆగస్టు 28: తెలంగాణ సాంకేతిక విద్యా వ్యవస్థను యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ (YISU) పరిధిలోకి తీసుకురావడంపై ఎమ్మెల్సీ డాక్టర్ దాసోజు శ్రవణ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. జీవో ఎంఎస్ నం.97 ద్వారా రాష్ట్రంలోని సాంకేతిక విద్యా వ్యవస్థను ఏకపక్షంగా విలీనం చేయడం సమంజసం కాదని పేర్కొంటూ, YISU బోర్డు ఆఫ్ గవర్నర్స్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రాకు బహిరంగ లేఖ రాశారు.

వైఐఎస్‌యూ చట్టం-2024లోని సెక్షన్ 23 ప్రకారం కీలక విధాన నిర్ణయాల్లో బోర్డు పాత్ర ఉందని, ఈ విలీనంపై బోర్డు సమావేశమైందా? ఎజెండాలో చేర్చారా? అధికారికంగా తీర్మానం ఆమోదించారా? లేక బోర్డును కూడా చీకట్లో ఉంచి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందా? అని దాసోజు ప్రశ్నించారు.

రాష్ట్రంలో 115 పాలిటెక్నిక్ కళాశాలలు, 64 అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ కేంద్రాలు, 301 ఐటీఐలు ఉన్నాయని, ఏటా లక్ష మందికి పైగా విద్యార్థుల భవిష్యత్తు ఈ వ్యవస్థతో ముడిపడి ఉందని తెలిపారు. మరోవైపు YISU ప్రస్తుతం సుమారు 1,000 మంది విద్యార్థుల సామర్థ్యంతో తాత్కాలిక ప్రాంగణంలో కొనసాగుతోందని, శాశ్వత క్యాంపస్ ఇంకా నిర్మాణంలోనే ఉందని పేర్కొన్నారు. ఇంత భారీ విద్యా వ్యవస్థను ఇలాంటి పరిస్థితుల్లో YISUకు ఎలా అప్పగిస్తారని ప్రశ్నించారు.

రూ.3,000 కోట్లతో సాంకేతిక విద్యను ఆధునీకరించే ప్రణాళికలు, ఐఐటీ హైదరాబాద్ సహకారంతో సెమీకండక్టర్ టెక్నాలజీ, అడ్వాన్స్‌డ్ మాన్యుఫ్యాక్చరింగ్, రోబోటిక్స్, ఎయిర్‌క్రాఫ్ట్ మెయింటెనెన్స్ వంటి కోర్సుల రూపకల్పన జరుగుతున్న సమయంలో వాటిని ఎందుకు నిలిపివేశారో ప్రభుత్వం స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు.

ఈ నిర్ణయం వల్ల ECET, బీటెక్ లేటరల్ ఎంట్రీ, డిప్లొమా సర్టిఫికెట్ల గుర్తింపు, ఫీజులు, రిజర్వేషన్లు, స్కాలర్‌షిప్‌లు, అధ్యాపకులు మరియు సిబ్బంది సర్వీసు నిబంధనలపై అనిశ్చితి నెలకొంటుందని ఆందోళన వ్యక్తం చేశారు.

ఇదిలా ఉండగా, మహబూబాబాద్‌లో తమ హక్కుల కోసం శాంతియుతంగా ఆందోళన చేస్తున్న పాలిటెక్నిక్ విద్యార్థులపై పోలీసులు లాఠీఛార్జ్ చేయడాన్ని దాసోజు శ్రవణ్ తీవ్రంగా ఖండించారు. విద్యార్థుల పట్ల పోలీసుల దురుసు ప్రవర్తన అమానుషమని పేర్కొన్నారు.

విలీనానికి సంబంధించి YISU బోర్డు సమావేశం తేదీ, ఎజెండా, హాజరైన సభ్యులు, తీర్మానాలు, డ్యూ డిలిజెన్స్ నివేదిక, మౌలిక సదుపాయాల ఆడిట్, నిధుల ప్రణాళిక తదితర వివరాలను ఆనంద్ మహీంద్రా బహిరంగంగా వెల్లడించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ యువత భవిష్యత్తుకు సంబంధించిన ఇలాంటి కీలక నిర్ణయాలను ఏకపక్ష జీవోల ద్వారా కాకుండా శాసనసభలో, ప్రజాక్షేత్రంలో విస్తృత చర్చ అనంతరం తీసుకోవాలని దాసోజు శ్రవణ్ స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *