
- భారీగా పడిపోయిన బంగారం ధరలు.. ఒక్కరోజులోనే తులానికి రూ.5 వేల వరకు తగ్గుదల
హైదరాబాద్, మే 16 (విశ్వం న్యూస్) : దేశవ్యాప్తంగా బంగారం ధరలు శనివారం భారీగా తగ్గాయి. మే 16న పసిడి ధరలు ఒక్కసారిగా కిందకు రావడంతో కొనుగోలుదారుల్లో ఆసక్తి పెరిగింది. ముఖ్యంగా ఒక్క రోజులోనే తులం బంగారం ధర సుమారు రూ.5 వేల వరకు తగ్గడం మార్కెట్లో చర్చనీయాంశంగా మారింది.
ప్రస్తుతం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,59,100గా నమోదైంది. అదే సమయంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,45,842 వద్ద కొనసాగుతోంది. నిన్నటి ధరలతో పోలిస్తే ఇవి గణనీయంగా తగ్గిన స్థాయిలుగా కనిపిస్తున్నాయి.
డాలర్ బలపడటమే ప్రధాన కారణం : బంగారం ధరలు తగ్గడానికి ప్రధాన కారణంగా అమెరికన్ డాలర్ బలపడటాన్ని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. డాలర్ విలువ పెరగడంతో అమెరికా ట్రెజరీ బాండ్లపై లభించే రాబడులు కూడా పెరిగాయి. దీంతో ఇన్వెస్టర్లు బంగారం వంటి సేఫ్ ఇన్వెస్ట్మెంట్స్ కంటే ట్రెజరీ బాండ్ల వైపు మొగ్గు చూపుతున్నారు.
ఈ పరిణామాల ప్రభావంతో అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్ ధరలు కూడా భారీగా పడిపోయాయి. ప్రస్తుతం స్పాట్ గోల్డ్ ధర ఒక ఔన్స్‌కు 4560 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. ఒక్క రోజులోనే దాదాపు 128 డాలర్ల మేర తగ్గుదల నమోదైంది. అలాగే జూన్ డెలివరీ యూఎస్ గోల్డ్ ఫ్యూచర్స్ 2.7 శాతం నష్టపోయి 4561 డాలర్ల వద్ద కొనసాగుతున్నాయి.